📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు!

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు!

📰 Generate e-Paper Clip

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు!

  • సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం
  • సెప్టెంబరు 1న జిల్లా కేంద్రాల్లో నిరసనలు.. 10న చలో హైదరాబాద్
  • సహకార శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.భీంరాజ్

హైదరాబాద్‌, ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.భీంరాజ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఉన్న గౌరవంతో ఇంతకాలం సంయమనం పాటించామని, పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారులు, సంబంధిత కమిటీలను కలిసి సమస్యలను వివరించినా పరిష్కారం లభించలేదన్నారు. ఇక సహనం కోల్పోయామని.. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు నాంపల్లిలోని గృహకల్ప భవనం వద్ద శుక్రవారం నిర్వహించిన మహాధర్నాలో సహకార శాఖ ఉద్యోగులు, అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీంరాజ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్‌ తదితర మొత్తాలను సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏ, వేతన సవరణ, ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల సహనానికి కూడా హద్దు ఉంటుందని, వారి ఐక్యతను తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరించారు.

ఐదు ప్రధాన డిమాండ్లు

రెండో వేతన సవరణ సంఘాన్ని వెంటనే ప్రకటించి అమలు చేయాలి.

పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలి.

సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలి. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్‌ఎస్‌ వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలి.

సెప్టెంబరు 1న జిల్లా కేంద్రాల్లో నిరసనలు

ఉద్యోగ జేఏసీ తదుపరి కార్యాచరణలో భాగంగా సెప్టెంబరు 1న అన్ని జిల్లా కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు నిర్వహించనున్నట్లు భీంరాజ్‌ తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే సెప్టెంబరు 10న లక్షలాది మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. సహకార శాఖలోని గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత మహాధర్నా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రమేనని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ఐక్యంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని భీంరాజ్‌ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular