📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ అలుపెరుగని పోరాటం

ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ అలుపెరుగని పోరాటం

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ అలుపెరుగని పోరాటం

  • ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పీఆర్టీయూ లక్ష్యం
  • ఉపాధ్యాయుల హక్కుల సాధనకు పీఆర్టీయూ నిరంతర పోరాటం
  • 183 మంది సభ్యులతో పెద్దేముల్ పీఆర్టీయూకు ప్రత్యేక గుర్తింపు
  • నూతన అధ్యక్షురాలిగా ఎం.విజయలక్ష్మి..ప్రధాన కార్యదర్శిగా గోబ్ర్యా నాయక్
  • నూతన కార్యవర్గానికి బాధ్యతలు.. సమన్వయంతో ముందుకు సాగాలి
  • సీపీఎస్‌ రద్దు కోసం సెప్టెంబర్‌ 1న మహాధర్నా విజయవంతం చేయాలి
  • పీఆర్టీయూ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దోమ అమర్నాథ్

పెద్దేముల్, ఆగస్టు 25(ప్రజాక్షేత్రం):ఉపాధ్యాయుల సమస్యలు, హక్కుల పరిరక్షణతో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిల సాధన కోసం పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తామని పెద్దేముల్ మండల పీఆర్టీయూ నూతన అధ్యక్షురాలు ఎం. విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గోబ్ర్యా నాయక్ అన్నారు. ఉపాధ్యాయులు తమ సమస్యలను ఎప్పటికప్పుడు సంఘం దృష్టికి తీసుకురావాలని, మండల స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఫంక్షన్‌ హాల్‌లో పెద్దేముల్ మండల పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం తాజా మాజీ అధ్యక్షుడు పోల నవీన్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా మాజీ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌రెడ్డి గత రెండేళ్లలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చేసిన కృషి తదితర అంశాలతో కూడిన ప్రగతి నివేదికను సమావేశంలో చదివి వినిపించారు. అనంతరం సంఘ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సభ్యులు చర్చించారు.

మహిళకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం

నూతన అధ్యక్షురాలు ఎం. విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గోబ్ర్యా నాయక్ మాట్లాడుతూ.. పెద్దేముల్ మండల పీఆర్టీయూ శాఖకు అధ్యక్షురాలిగా మహిళకు అవకాశం లభించడం గర్వకారణమన్నారు. వికారాబాద్ జిల్లాలోనే మండల స్థాయిలో అధ్యక్షురాలిగా మహిళకు అవకాశం దక్కడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని విజయలక్ష్మి పేర్కొన్నారు. తమపై నమ్మకం, అభిమానంతో నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు పెండింగ్ బకాయిల సాధన కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. సంఘాన్ని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు. గతంలో వివిధ పదవుల్లో పనిచేసిన సంఘ నాయకులు, బాధ్యులు, కార్యవర్గ సభ్యులు నూతన పాలకవర్గానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. పెద్దేముల్ మండల పీఆర్టీయూలో సభ్యులుగా ఉన్న 183 మంది ఉపాధ్యాయులు సైనికుల్లా పనిచేస్తూ నూతన కార్యవర్గానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

నూతన కార్యవర్గానికి అభినందనలు

తాజా మాజీ అధ్యక్షుడు పోల నవీన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సంఘ సభ్యత్వం తీసుకుని సంఘ బలోపేతానికి సహకరించాలని కోరారు. గత రెండేళ్లుగా తమకు అవకాశం కల్పించి ఉపాధ్యాయులకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేసి పీఆర్టీయూకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఉపాధ్యాయుల హక్కుల కోసం పీఆర్టీయూ పోరాటం

పీఆర్టీయూ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దోమ అమర్నాథ్ మాట్లాడుతూ.. పీఆర్టీయూ సభ్యత్వం తీసుకున్న ఏ ఒక్క ఉపాధ్యాయుడికీ అన్యాయం జరగకుండా సంఘం అండగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఉపాధ్యాయుల సమస్యలు, హక్కుల సాధన కోసం కృషి చేస్తున్న సంఘం పీఆర్టీయూ అని పేర్కొన్నారు.ఉపాధ్యాయుల శ్రేయస్సు, అభ్యున్నతి కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందన్నారు. శిశు సంరక్షణ సెలవుల పెంపు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఉపాధ్యాయుల టెట్ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి చేసిన కృషిని వారు గుర్తు చేశారు. అలాగే ఈహెచ్‌ఎస్ సమస్య పరిష్కారానికి సుమారు 650 ఆసుపత్రుల్లో 2,000 రకాల జబ్బులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకునేందుకు పీఆర్టీయూ కృషి చేస్తోందన్నారు.
పీఆర్టీయూ చీటికిమాటికి ఉపాధ్యాయులను రోడ్లపైకి తీసుకువచ్చే సంఘం కాదని, అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి సభ్యుడు సంఘానికి కట్టుబడి ఉండాలని, పీఆర్టీయూ సభ్యులంతా ఒక కుటుంబంలా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.

సెప్టెంబర్ 1 మహాధర్నాను విజయవంతం చేయాలి

పెద్దేముల్ మండల పీఆర్టీయూ శాఖ 183 మంది సభ్యులతో జిల్లాలో అత్యధిక సభ్యత్వం కలిగిన మండల శాఖగా నిలిచిందని జిల్లా నాయకులు పేర్కొన్నారు. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తాలని సూచించారు. సీపీఎస్‌ రద్దు కోసం సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉపాధ్యాయుల మహాధర్నాకు జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక

అనంతరం పెద్దేముల్ మండల పీఆర్టీయూ శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షురాలిగా ఎం. విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా గోబ్ర్యా నాయక్, అసోసియేట్ అధ్యక్షులుగా బి. నర్సిరెడ్డి, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా కే. సంగీత, ఉపాధ్యక్షులుగా బి. శివకుమార్, సి. సురేష్, మహిళా ఉపాధ్యక్షులుగా బి. రాధిక, అంబిక, కార్యదర్శులుగా పి. రమేష్, ఎం.డి. అల్తాఫ్, మహిళా కార్యదర్శులుగా పి. పుష్పలత, యూ. శాంతి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని పలువురు ఉపాధ్యాయులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు డి. వెంకట్రామ్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ద్యావరి నరేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ మాసపత్రిక సంపాదకవర్గ సభ్యుడు బాకారం జైపాల్‌రెడ్డి, పెద్దేముల్ మండల విద్యాధికారి పి. నర్సింగ్‌రావు, జీహెచ్‌ఎంలు అక్క మాదేవి, కే. జోజప్ప, గొట్లపల్లి మోడల్ స్కూల్, కళాశాల ప్రిన్సిపాల్ పి. గాయత్రి, సంఘ బాధ్యులు, నాయకులు, వివిధ మండలాల పీఆర్టీయూ నాయకులు బాబ్యానాయక్, ఊరడి లక్ష్మయ్య, మాణిక్యం, మల్లేశం, రాధ, రవీందర్, రవికాంత్‌రెడ్డి, గంజి బందెప్ప, ఆంజనేయులు లతో పాటు పలువురు ఉపాధ్యాయులు, పీఆర్టీయూ సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular