పెద్దేముల్ తండా పాఠశాలకు జాదవ్ సునీల్ నాయక్ చేయూత
- ప్రభుత్వ పాఠశాలకు వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ తనయుడు జాదవ్ సునీల్ నాయక్ అండ
- విద్యార్థుల కోసం 43 అంగుళాల టీవీ బహూకరణ.. పాఠశాల సుందరీకరణకు పెయింటింగ్స్
పెద్దేముల్, ఆగస్టు 15 (ప్రజాక్షేత్రం)
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని పెద్దేముల్ తండా MPPS ప్రధానోపాధ్యాయులు ఎండి.అల్తాఫ్ అన్నారు.పెద్దేముల్ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం 43 అంగుళాల టీవీని దాత జాదవ్ సునీల్ నాయక్ బహూకరించారు. అదే విధంగా పాఠశాల ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా కనిపించేలా ప్రత్యేకంగా పెయింటింగ్స్ వేయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎండి. అల్తాఫ్ మాట్లాడుతూ.. పాఠశాలలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు టీవీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యా వీడియోలు, విజువల్ కంటెంట్, సైన్స్ అంశాలు, ఇతర పాఠ్యాంశాలకు సంబంధించిన డిజిటల్ పాఠాలను విద్యార్థులకు చూపించడం ద్వారా విషయాలను సులభంగా, ఆసక్తికరంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా..
దాత జాదవ్ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యా వాతావరణం, అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మన ప్రాంతంలోని విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే పాఠశాలకు టీవీ అందించడంతో పాటు సుందరీకరణ కోసం పెయింటింగ్స్ వేయించినట్లు తెలిపారు.పాఠశాలకు భవిష్యత్తులో ఏవైనా అవసరాలు ఉంటే తన వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం చేసే ప్రతి సహాయం వారి భవిష్యత్తుకు పెట్టుబడేనని పేర్కొన్నారు.
దాతకు కృతజ్ఞతలు
పాఠశాల అవసరాన్ని గుర్తించి టీవీని బహుకరించడంతో పాటు పాఠశాల సుందరీకరణకు సహకరించిన జాదవ్ సునీల్ నాయక్‌కు ప్రధానోపాధ్యాయులు ఎండి.అల్తాఫ్, ఉపాధ్యాయులు రవికాంత్ రెడ్డి, AAPC చైర్‌పర్సన్ పద్మ, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు మల్లయ్య, లక్ష్మణ్, గ్రామ యువకులు రాహుల్, రెడ్యానాయక్, శ్రీను, రాము సింగ్ తదితరులు పాల్గొన్నారు.

