పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయ ఘటనపై డీపీఓ సమగ్ర విచారణ
- కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా పంచాయతీ అధికారి జయసుధ
- ఇరువర్గాల వాదనలు నమోదు చేసిన డీపీఓ
- సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులతో విడివిడిగా విచారణ
- విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం
- తప్పు ఎవరిదైనా పంచాయతీరాజ్ చట్టం-2018 శాఖాపరమైన చర్యలు తప్పవు : డీపీఓ జయసుధ
పెద్దేముల్, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 14న చోటుచేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ సోమవారం సుదీర్ఘ విచారణ చేపట్టారు. కందనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్, అదే గ్రామ పంచాయతీ కార్యదర్శి కే.నవిత, జయరాం తండా పంచాయతీ కార్యదర్శి మల్లేష్‌లను వేర్వేరుగా విచారించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.దాదాపు కొన్ని గంటల పాటు మండల పరిషత్ కార్యాలయంలో విచారణ కొనసాగింది.
ఫిర్యాదులతో మొదలైన వివాదం
ఈ నెల 14న పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఎంపీడీవో కే.తిరుమల స్వామి, ఎంపీవో రతన్ సింగ్ హాజరయ్యారు. ఇదే సమయంలో కందనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్ తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి కే.నవిత విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శి కే.నవిత కూడా సర్పంచ్ తనను వేధింపులకు గురిచేస్తున్నారని, గ్రామ పంచాయతీని ఉద్దేశించి దుర్భాషలాడుతున్నారని ఎంపీడీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో ఇరువర్గాలను ఎంపీడీవో, ఎంపీవోలు పిలిపించి ఫిర్యాదులపై చర్చిస్తున్న సమయంలో వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
మాటల యుద్ధం.. చివరకు ఘర్షణ
సర్పంచ్ తనను దుర్భాషలాడుతున్నారని పంచాయతీ కార్యదర్శి కే.నవిత జయరాం తండా పంచాయతీ కార్యదర్శి మల్లేష్‌ను ఎంపీడీవో ఛాంబర్లోకి పిలిచినట్లు తెలిసింది. ఈ క్రమంలో సర్పంచ్ ఆనంద్ నాయక్, పంచాయతీ కార్యదర్శి మల్లేష్ మధ్య వాగ్వాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వాగ్వాదం తీవ్రరూపం దాల్చిన సమయంలో సర్పంచ్ కుమారుడు నితీష్ తనపై దాడి చేశారని పంచాయతీ కార్యదర్శి మల్లేష్ ఆరోపించిన విషయం తెలిసిందే.
పరస్పర ఫిర్యాదులతో కేసులు
ఘటన అనంతరం సర్పంచ్ ఆనంద్ నాయక్ తొలుత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.అనంతరం పంచాయతీ కార్యదర్శులు కే.నవిత, మల్లేష్లు కూడా వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కలెక్టర్‌ను ఆశ్రయించిన పంచాయతీ కార్యదర్శులు
ఘటనపై తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై దాడి జరగడం పట్ల చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇరువర్గాల నుంచి కీలక వివరాల సేకరణ
విచారణలో భాగంగా ముందుగా కందనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్‌తో డీపీఓ జయసుధ మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి కే. నవిత, జయరాం తండా పంచాయతీ కార్యదర్శి మల్లేష్‌లను వేర్వేరుగా విచారించారు. ఈ సందర్భంగా కే.నవిత, మల్లేష్లు తమపై జరిగినట్లు చెబుతున్న వేధింపులు, దాడి విషయాలను డీపీఓ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సర్పంచ్ ఆనంద్ నాయక్ కూడా తన వాదనను అధికారికి వివరించారు.
ప్రభుత్వ ఆస్తులపై సర్పంచ్ ఫిర్యాదు
తాను సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రభుత్వ ఆస్తులైన ఎల్ఈడీ టీవీ, వాటర్ ప్లాంట్ మిషన్, ఫాగింగ్ మిషన్ తదితరాలు ఎక్కడ ఉన్నాయో పంచాయతీ కార్యదర్శి తనకు వివరించడం లేదని సర్పంచ్ ఆనంద్ నాయక్ డీపీఓ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో విధుల నిర్వహణ కూడా సక్రమంగా లేదని ఆరోపించారు.
ఈ అంశాలపై సర్పంచ్ ఆనంద్ నాయక్ డీపీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
తప్పు ఎవరిదైనా చర్యలు తప్పవు
ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి జయసుధ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 14న పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. కందనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్, పంచాయతీ కార్యదర్శులు కే.నవిత, మల్లేష్లతో వేర్వేరుగా మాట్లాడి పలు వివరాలను సేకరించినట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు.ఇరువర్గాల నుంచి కీలక అంశాలను స్వీకరించినట్లు తెలిపారు. ఇప్పటికే పెద్దేముల్ ఎంపీడీవో కే. తిరుమల స్వామి, ఎంపీవో రతన్ సింగ్ తమకు నివేదిక అందించారని పేర్కొన్నారు.విచారణలో ఎవరిది తప్పు అని తేలినా పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం శాఖాపరమైన కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని డీపీఓ జయసుధ స్పష్టం చేశారు.
కలెక్టర్‌కు విచారణ నివేదిక
పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయంలో చేపట్టిన విచారణకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని డీపీఓ జయసుధ తెలిపారు. నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ విచారణలో పెద్దేముల్ మండల ఎంపీడీవో కే.తిరుమల స్వామి, ఎంపీవో రతన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


