బోనాలతో గ్రామ దేవతల అనుగ్రహం లభిస్తుంది
సర్పంచ్ రాముచి నాగరాజు
హెగ్డోలిలో ఘనంగా బోనాల పండుగ
బోనాల వేడుకల్లో ఆకట్టుకున్న శివసత్తులు, పోతారాజుల ఆట
కోటగిరి,ఆగస్టు02(ప్రజాక్షేత్రం): బోనాలతో గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పిస్తే గ్రామం గ్రామదేవతల అనుగ్రహంతో సుభిక్షంగా ఉంటుందని హెగ్డోలి గ్రామ సర్పంచ్ రాముచి నాగరాజు అన్నారు. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సహా గ్రామ పెద్దలు యువకులు మహిళలు బోనమెత్తి గ్రామ దేవతలకు బోనాలతో నైవిద్యం సమర్పించారు.బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో శివసత్తులు, పోతరాజుల ఆట భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయ వేషధారణలో శివసత్తులు పోతరాజులు డప్పుల మోతకు అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించారు.శివసత్తులు, పోతరాజుల విన్యాసాలు, కత్తుల ప్రదర్శనలు, హోరెత్తించిన నృత్యాలతో గ్రామం ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోతరాజుల ఆటను వీక్షిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామంలో బోనాల వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ రాముచి నాగరాజు మాట్లాడుతూ… గ్రామ దేవతల కృప కటాక్షం అంటేనే గ్రామం సుభిక్షంగా ఉంటుందని అందుకోసమే గ్రామస్తులు అందరి సహకారంతో గ్రామంలో బోనాల పండుగను నిర్వహించి గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించినట్లు తెలిపారు. గ్రామ దేవతల ఆశీర్వాదంతో గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల పంటలు పండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు.

