సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
- ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున్ రెడ్డి, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్
మొయినాబాద్, ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండటమే వాటికి ఏకైక పరిష్కారమని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ వై. మల్లికార్జున్ రెడ్డి, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. ఉపేందర్ స్పష్టం చేశారు. మొయినాబాద్ చౌరస్తా నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో కలిసి సైబర్ క్రైమ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేటుగాళ్లు లాటరీలు, తక్కువ ధరలకే వస్తువులు, పార్ట్-టైమ్ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని, సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎమ్ పిన్ నంబర్లు, ఓటీపీ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని, బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేసి భయపెట్టినా స్పందించవద్దు అని సూచించారు. కాలేజీ విద్యార్థులు సైబర్ భద్రతపై సమాజాన్ని, ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులను చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ఎవరైనా ఆన్‌లైన్ మోసాల బారిన పడితే వెంటనే ఆందోళన చెందకుండా, ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సుభాష్, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది, గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

