📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణ35 ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం.. ఆలయంలోకి దళితుడు చేరుకున్న క్షణం

35 ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం.. ఆలయంలోకి దళితుడు చేరుకున్న క్షణం

📰 Generate e-Paper Clip

35 ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం.. ఆలయంలోకి దళితుడు చేరుకున్న క్షణం

సంగారెడ్డి జిల్లా ఆగస్టు 20(ప్రజాక్షేత్రం):35 ఏళ్లుగా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చింది.. ఆలయ గడప దాటేందుకు అనుమతి లేని రోజుల నుంచి.. అదే ఆలయంలో గర్భగుడి వరకు అడుగులు వేసే స్థాయికి మార్పు వచ్చింది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇది కేవలం ఓ ఆలయ ప్రవేశ కార్యక్రమం కాదు.. కుల వివక్షపై మానవత్వం సాధించిన విజయంగా నిలిచిన భావోద్వేగ ఘట్టం. విశ్వహిందూ పరిషత్ చేపట్టిన ‘సామాజిక సమరసత అభియాన్’ ఆధ్వర్యంలో బుధవారం హనుమాన్ ఆలయంలో చారిత్రాత్మక కార్యక్రమం జరిగింది. దశాబ్దాలుగా ఆలయానికి దూరంగా ఉన్న దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు. ‘సమానత్వమే సనాతన ధర్మం’ అనే సందేశాన్ని చాటుతూ స్వామీజీలు, గ్రామ పెద్దలు, వి హెచ్ పి నాయకులు వారిని సాదరంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అందరినీ కదిలించిన దృశ్యం ఒక్కటే.. దళిత యువకుడు ప్రవీణ్‌ను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తన భుజాలపై ఎత్తుకున్నారు. ఆలయ గడప దాటించారు. ఎన్నో ఏళ్లుగా మనసులో మిగిలిపోయిన బాధను చెరిపేస్తున్నట్టుగా.. ఆ యువకుడి అడుగులు హనుమంతుడి సన్నిధికి చేరుకున్నాయి. ఆ క్షణంలో అక్కడున్న వారి కళ్లలో ఆనందం.. గుండెల్లో భావోద్వేగం.. తరతరాలుగా తమకు దూరంగా ఉన్న దేవుడిని తొలిసారిగా గర్భగుడిలోకి వెళ్లి దర్శించుకున్న దళిత మహిళలు, వృద్ధుల కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. ‘మేమూ ఈ సమాజంలో భాగమే.. దేవుడి ముందు మాకూ సమాన హక్కే’ అన్న భావన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. పూజ్యశ్రీ శంకర్ స్వామీజీ, పూజ్య సర్వేశ్వర అంబికా శివయోగి మార్గదర్శనంలో..వి హెచ్ పి సామాజిక సమరసత తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ధనుంజయ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయంలో పూజలు ముగిసిన అనంతరం గ్రామంలో ‘జై శ్రీరామ్’ నినాదాలు మార్మోగాయి. అయితే ఆ నినాదాల కంటే బలంగా వినిపించింది ఒక్క సందేశమే.. మనిషిని మనిషిగా గౌరవించడమే నిజమైన సమరసత. కమలాపూర్‌లో జరిగిన ఈ ఘటన.. ఒకరోజు కార్యక్రమంతో ముగిసిపోయే విషయం కాదు. 35 ఏళ్లుగా ఉన్న ఒక గోడను కూల్చిన సందర్భం. ఆలయ గడప వద్ద మొదలైన ఈ మార్పు.. సమాజంలోని ప్రతి గడపకు చేరాలన్న ఆకాంక్షను రేకెత్తించిన ఘట్టం. 35 ఏళ్ల ఎదురుచూపు.. ఒక అడుగుతో ముగిసింది. ఆలయ గడప దాటింది ఒక్క ప్రవీణ్ కాదు.. సమానత్వం కూడా అడుగుపెట్టింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular