35 గ్రామ కమిటీల ఏర్పాటు.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
- కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలే కీలకం
- 35 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి
- మిగిలిన మూడు గ్రామాల్లో త్వరలో కమిటీ లను పూర్తి చేస్తాం
- విలేఖరుల సమావేశంలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి
పెద్దేముల్, ఆగస్టు 21(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం తన నివాసంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన పార్టీ గ్రామ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు అంశాలను వెల్లడించారు. గత 7,8 రోజులుగా పెద్దేముల్ మండలంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నామని మహిపాల్ రెడ్డి తెలిపారు. కందనెల్లి నుంచి ప్రారంభించి రుద్రారం వరకు మండలంలోని మొత్తం 38 గ్రామపంచాయతీల్లో పర్యటించి ఇప్పటివరకు 35 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చెప్పారు.మరో 03 గ్రామపంచాయతీల్లో కమిటీల ఏర్పాటు పెండింగ్‌లో ఉందని, త్వరలో ఆయా గ్రామాలకు మరోసారి వెళ్లి గ్రామ కమిటీలను ఎన్నుకుంటామని తెలిపారు.
పోటీ ఉన్నా సమన్వయంతో ఎన్నికలు
మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో గ్రామ కమిటీ అధ్యక్ష పదవికి పలువురు పోటీకి వచ్చినప్పటికీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేశామని మహిపాల్ రెడ్డి అన్నారు. తట్టేపల్లి గ్రామ కమిటీ అధ్యక్ష పదవికి 05 మంది , జనగాంలో 02, కందనెల్లి తండాలో 05 మంది పోటీకి రావడంతో ఆ మూడు గ్రామాల్లో గ్రామ కమిటీ లను ఎన్నిక జరుగలేదని, త్వరలో ఆ గ్రామాల్లో కూడా పర్యటించి అవి కూడా పూర్తి చేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో వివరించే సామర్థ్యం ఉన్న నాయకులను ఆచితూచి నూతనంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఎంపిక చేశామని చెప్పారు.
ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలతో పాటు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, భవిష్యత్‌లో చేపట్టబోయే అభివృద్ధి పనులను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించాలని నూతన గ్రామ కమిటీ అధ్యక్షులు,కార్యకర్తలకు పి.మహిపాల్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రజలకు చేరేలా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు.
సమిష్టి కృషితో కమిటీల ఏర్పాటు
పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమిష్టి కృషితో పాటు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అందించిన సహాయ సహకారాలతో పెద్దేముల్ మండలంలో 35 గ్రామపంచాయతీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయగలిగామని పి.మహిపాల్ రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెంచుకుని కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని అన్నారు.
10 వేల మెజార్టీ లక్ష్యంగా పనిచేయాలి
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దేముల్ మండలం నుంచి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి సుమారు వెయ్యి ఓట్ల మెజార్టీ లభించిందని మహిపాల్ రెడ్డి గుర్తుచేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో మనోహర్ రెడ్డికి 10 వేల మెజార్టీ వచ్చేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న రెండు సంవత్సరాల్లో తాండూరు నియోజకవర్గంతో పాటు పెద్దేముల్ మండలంలోని గ్రామాల రూపురేఖలు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరేలా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని మహిపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కే.గోపాల్, ఎన్. ఎల్లారెడ్డి, పెండ్యాల ప్రవీణ్ కుమార్ గుప్తా, గాజీపూర్ నసీరొద్దీన్, ఉప్పరి మల్లేషం, మంబాపూర్ శ్రీనివాస్ రెడ్డి, నారాయణ గౌడ్, గాజీపూర్ లాల్ రెడ్డి, నాగి రెడ్డి, తట్టేపల్లి జగన్, తట్టేపల్లి కే.నర్సింహులు, ఎండి.రియాజ్, శ్రావణ్ కుమార్, హర్ష వర్ధన్ రెడ్డి, కుర్వ శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, శంకర్ నాయక్, సాబెర్, సోహెల్, పడగాళ్ళ రాజు, హన్మంతు, చంద్రశేఖర్, కుమ్మరి సాయిలు, ఫెరోజ్, రుద్రారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

