📄 ePaper
Sunday, September 20, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రతి ఓటునూ కాపాడాలి

ప్రతి ఓటునూ కాపాడాలి

📰 Generate e-Paper Clip

  • బీఎల్‌ఏ-2లదే కీలక బాధ్యత
  • ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు
  • ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
  • జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి.

వనపర్తి, సెప్టెంబరు 17(ప్రజాక్షేత్రం):ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ప్రతి ఓటు పరిరక్షణకు బూత్‌ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏ-2) కీలకంగా పనిచేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఓటర్ల వివరాల పరిశీలన, తప్పుల సవరణ, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వనపర్తి పట్టణంలోని ఆర్‌జీ గార్డెన్స్‌లో గురువారం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై బీఎల్‌ఏ-2లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మల్లేష్‌ యాదవ్‌, శత్రురావు శిక్షకులుగా వ్యవహరించారు.

ప్రతి వివరాన్నీ పరిశీలించాలి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బూత్‌ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కు జాబితాలో సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ఓటరు నమోదు, వివరాల సవరణ సమయంలో చిన్నపాటి పొరపాట్లకు కూడా అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పేరు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులు గుర్తిస్తే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సకాలంలో సరిచేయించాలని సూచించారు.

నోటీసులపై అవగాహన కల్పించాలి

ఓటర్ల వివరాల పరిశీలనలో భాగంగా కొంతమందికి నోటీసులు అందుతున్న నేపథ్యంలో వాటిని నిర్లక్ష్యం చేయకుండా చూడాలని బీఎల్‌ఏ-2లకు మేఘారెడ్డి సూచించారు. అవసరమైన పత్రాలు, వివరాలను సకాలంలో సమర్పించేలా సంబంధిత ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పారు.

పనిచేయని చోట కొత్తవారి నియామకం

ప్రతి బూత్‌లో బీఎల్‌ఏ-2లు క్రియాశీలకంగా పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. విధులను సక్రమంగా నిర్వహించని బీఎల్‌ఏ-2ల వివరాలను సేకరించి, అవసరమైన ప్రాంతాల్లో కొత్తవారిని నియమించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్ల హక్కుల పరిరక్షణలో బూత్‌ స్థాయిలో పనిచేసే ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన అంశాలను దృశ్య మాధ్యమం ద్వారా శిక్షకులు బీఎల్‌ఏ-2లకు వివరించారు. ఓటర్ల వివరాల పరిశీలన, తప్పుల సవరణ, అర్హులైన ఓటర్ల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయిచరణ్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి రమేష్‌, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌ గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular