మంజీరా నుండి జోరుగా అక్రమ ఇసుక రవాణా..!
- పోతంగల్ మండలం లోని పలు గ్రామాల నుండి యథేచ్చగా ఇసుక తరలింపు.
- పట్టించుకోని అధికారులు రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.
- అక్రమ ఇసుకపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు.
బాన్సువాడ, సెప్టెంబర్ 02(ప్రజాక్షేత్రం):బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాల నుండి పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. ప్రతిరోజు రాత్రి ఒంటిగంట నుండి మొదలు మొదలుకొని ఉదయం 8 గంటల వరకు విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది. పోతంగల్ మండలం కల్లూరు, కొడిచెర్ల, పోతంగల్, సుంకిని గ్రామాల నుండి అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. మండల తహసిల్దార్ సహా రెవెన్యూ అధికారులు ఎస్ఐఆర్ ప్రక్రియలో బిజీ బిజీగా ఉండటంతో ఇదే అదునుగా భావిస్తున్న అక్రమ ఇసుక మాఫియా గాళ్లు పట్టపగలే విచ్చలవిడిగా ఇసుక రవాణా కొనసాగిస్తుండటం గమనార్హం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం అధికారులు పర్మిషన్లు ఇస్తున్నప్పటికీ అధిక ధనార్జనే ధ్యేయంగా అక్రమ ఇసుక మాఫియా గాళ్లు జోరుగా ఇసుక నడుపుతున్నట్లు సమాచారం. కొడిచెర్ల గ్రామం నుండి కల్లూరు గ్రామం మీదుగా నిత్యం ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నప్పటికీ అధికారులు మాత్రం అటువైపు వెళ్లకపోవడంతో అధికారుల తీరుపై విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి. గతంలో గ్రామంలోని కోట్ల రూపాయలతో వేసుకున్న రోడ్లు పాడవుతున్నాయని, స్కూలుకు వెళ్లే పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పొలాలకు వెళ్లే రైతులకు కూలీలకు ఇసుక ట్రాక్టర్ల రవాణా ద్వారా పలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కల్లూరు గ్రామస్తులు కొడిచర్ల గ్రామం నుండి నడిచే అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనలో ట్రాక్టర్ యజమానులు డ్రైవర్ల పై కేసులు నమోదు చేసిన పోలీసులు అక్రమ ఇసుక రవాణా జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించినప్పటికీ ఇసుక అక్రమ రవాణా చేసే ఇసుక మాఫియాగాళ్లు మాత్రం అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేసి విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తుండటం గమనార్హం. మంజీర పరివాహక ప్రాంతం నుండి కొన్ని రైస్ మిల్లుల వద్ద ఇసుక డంప్ చేసి అక్కడి నుండి ట్రిప్పర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ అధికారులు మాత్రం మౌనం వహిస్తుండటం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పోలీస్ బాస్ కళ్ళు కప్పి కొందరు పోలీసులు సైతం అక్రమ ఇసుక మాఫియా గాళ్ళకు సహకరిస్తున్నారని అందువల్లే పలుమార్లు ఇసుక ట్రాక్టర్లను పట్టుకునేందుకు వెళ్లిన పోలీస్ బాస్ కు దొరకకుండా ఆయన కళ్ళు కప్పి ఇసుక ట్రాక్టర్ల యజమానులు తప్పించుకుంటున్నట్లు తెలుస్తుంది. సామాన్యులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అందని ఇసుక అక్రమార్కులకు నిత్యం ఎలా దొరుకుతుందని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని పోతంగల్ మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతం నుండి జరిగే అక్రమ ఇసుక రవాణా ఆపాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ ఇసుక రవాణా పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి ఎస్ఐఆర్ లో బిజీగా ఉన్నాం, అక్రమ ఇసుకపై చర్యలు తీసుకుంటాం… పోతంగల్ తహసిల్దార్ సందీప్ పోతంగల్ మండలం నుండి నిత్యం జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా పై తహసిల్దార్ సందీప్ ను వివరణ కోరగా రెవెన్యూ సిబ్బంది అందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో బిజీగా ఉన్నారని, జిపిఓలు సైతం బిఎల్వోలుగా వ్యవహరిస్తూ నోటీసులు పంచుతున్నారని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా జరిగితే మాత్రం సహించేది లేదని అవసరమైతే పోలీసుల సహకారంతో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటామని అన్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

