రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ తిరుగుబాటు.. ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు!!
- నాపై చర్యలు తీసుకునే ముందు సీఎంపై తీసుకోండి
- ఖర్గేతో భేటీ తర్వాత కొండా సురేఖ హాట్ కామెంట్స్
- తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు!
న్యూఢిల్లీ సెప్టెంబర్ 02(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాజకీయాల్లో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఆమె బుధవారం ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తనపై వస్తున్న ఆరోపణలను ఖర్గేకు రాతపూర్వకంగా వివరించినట్లు ఆమె పేర్కొన్నారు. ఖర్గేతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎలా చెప్పుకుంటారని, పార్టీ అభ్యర్థులను నిర్ణయించాల్సింది హైకమాండ్ అయినప్పుడు పరకాల నియోజకవర్గ అభ్యర్థిని ఆయన ఇప్పుడే ఎలా ప్రకటిస్తారని ఆమె నిలదీశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన పేరిట తనపై చర్యలు తీసుకునే ముందు, నియమాలను ఉల్లంఘించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రిపైనే అధిష్ఠానం మొదట చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పెళ్లయి స్వతంత్రంగా జీవిస్తున్న తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలకు తనను బాధ్యురాలిని చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్టీలో బీసీ వర్గాలపై వివక్ష సాగుతోందంటూ ఆమె సామాజిక కార్డును తెరపైకి తెచ్చారు. వెనుకబడిన వర్గానికి చెందిన మహిళ అయినందునే తనను టార్గెట్ చేస్తున్నారని, కేబినెట్‌లోని ఇతర సామాజిక వర్గాల మంత్రులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా రాష్ట్రంలోని బీసీ నేతలంతా ఏకమవుతారని ఆమె కాంగ్రెస్ నాయకత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతానికి తనను ఎవరూ మంత్రి పదవికి రాజీనామా చేయమని కోరలేదని, అధిష్ఠానం తీసుకునే అంతిమ నిర్ణయం కోసం వేచి చూస్తున్నానని ఆమె తెలిపారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంతో తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఏ మలుపు తిరుగుతాయోనన్నది ఉత్కంఠగా మారింది.

