మున్సిపాలిటీలో అవినీతి పరుగు
- ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు!
- రూ. 75 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్
- నాంపల్లి ప్రత్యేక కోర్టుకు నిందితుల తరలింపు
మొయినాబాద్, సెప్టెంబర్ 30(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో అవినీతి అధికారులు మరోసారి ఏసీబీ వలలో చిక్కారు. ప్రజలకు సేవ చేయాల్సిన స్థానంలో ఉండి, అక్రమ వసూళ్లే ధ్యేయంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి, సీనియర్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల మెరుపు దాడిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
అక్రమాల బాగోతం ఇలా
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి (ఏవో-1), ఫిర్యాదుదారుడి నిర్మాణాన్ని చట్టవిరుద్ధమైనదిగా పేర్కొంటూ.. దానిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అధికారిక సహాయం చేస్తానని నమ్మబలికారు. ఈ వ్యవహారంలో భాగంగా మొయినాబాద్ గ్రామ పంచాయతీ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న యలమోని సుదర్శన్ (ఏవో-2) ద్వారా బాధితుడి నుంచి ఏకంగా రూ. 75,000 లంచాన్ని డిమాండ్ చేశారు.
పక్కా వ్యూహంతో ట్రాప్ చేసిన ఏసీబీ
బాధితుడు అందించిన ఫిర్యాదు మేరకు సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. మున్సిపాలిటీ కార్యాలయ పరిధిలో మాటువేసి, ఏవో-2 సూచన మేరకు రూ. 75,000 నగదును స్వీకరిస్తుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, నిందితులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారించారు.
పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని కేసుల గౌరవనీయ మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది ఎవరైనా పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఎవరూ భయపడకుండా వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు కోరారు.

