సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి
- సయ్యద్ తౌశిక్ కుటుంబానికి అండగా మంద కృష్ణ మాదిగ
- తౌశిక్, తల్లి మౌలాబి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
- రౌండ్ టేబుల్ సమావేశంలో…ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
అమరావతి, అక్టోబర్ 01(ప్రజాక్షేత్రం):సింగరాయకొండ శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సయ్యద్ తౌశిక్, ఆయన తల్లి మౌలాబి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ తెలిపారు. తౌశిక్, మౌలాబి మృతులపై సమగ్ర విచారణ జరిపించి,బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని, మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ముస్లిం మైనారిటీ, దళిత, కుల, విద్యార్థి ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మృతుల కుటుంబ పరిస్థితులు, ఘటనకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించారు. తౌశిక్, మౌలాబి మృతుల ఘటనపై నిజనిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. రౌండ్‌టేబుల్ సమావేశానికి ముస్లిం మైనారిటీ, దళిత, ప్రజా, విద్యార్థి సంఘాలతో పాటు వివిధ వర్గాలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు.

