Homeతెలంగాణకార్యదర్శి లేని పంచాయతీ..గాడి తప్పిన పాలన!

కార్యదర్శి లేని పంచాయతీ..గాడి తప్పిన పాలన!

📰 Generate e-Paper Clip

కార్యదర్శి లేని పంచాయతీ..గాడి తప్పిన పాలన!

  • మూడు నెలలుగా ఇంచార్జి కార్యదర్శి కోసం ఎదురుచూపులు
  • పక్షం రోజులకే పరిమితమవుతున్న పర్యవేక్షణ..ప్రజలకు తప్పని తిప్పలు
  • పింఛన్ల ఆన్‌లైన్ ప్రక్రియకూ ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి
  • బండమీదిపల్లికి పూర్తిస్థాయి కార్యదర్శిని నియమించాలంటున్న ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు

పెద్దేముల్, అక్టోబర్ 13(ప్రజాక్షేత్రం):గ్రామ పంచాయతీకి కార్యదర్శి లేకపోతే పాలన ఎలా సాగుతుంది? ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేదెవరు? ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించేదెవరు? పెద్దేముల్ మండల పరిధిలోని బండమీదిపల్లి గ్రామపంచాయతీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఈ ప్రశ్నలకు అద్దం పడుతున్నాయి. దాదాపు మూడు నెలలుగా పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో గ్రామ పాలనపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారి తరచూ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్థాయి పనుల కోసం ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.

పంచాయతీకి కార్యదర్శి కరువు.. పాలనకు ఆటంకం!

బండమీదిపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన మొగులేష్ అడికిచర్ల గ్రామపంచాయతీకి బదిలీ కావడంతో ఆయన స్థానంలో తట్టేపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న గోపాల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఫిబ్రవరి నెలలో బండమీదిపల్లి పంచాయతీ బాధ్యతలు చేపట్టిన గోపాల్‌.. రెండు గ్రామపంచాయతీల విధులను నిర్వహించాల్సి వస్తోంది.దీంతో బండమీదిపల్లి గ్రామానికి పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గత మూడు నెలల వ్యవధిలో ఆయన బండమీదిపల్లికి కేవలం 10 నుంచి 15 రోజులే వచ్చారని తెలుస్తోంది. ఇంచార్జి వ్యవస్థలో పరిపాలన సాగుతుండటంతో గ్రామస్థాయి సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.

రెండు పంచాయతీలు.. ఒకే కార్యదర్శి!

తట్టేపల్లి గ్రామపంచాయతీకి పూర్తిస్థాయి కార్యదర్శిగా ఉన్న గోపాల్‌కు బండమీదిపల్లి అదనపు బాధ్యతలు అప్పగించడంతో రెండు గ్రామాల మధ్య విధుల నిర్వహణ సవాలుగా మారింది.ఒకే అధికారి రెండు పంచాయతీలను పర్యవేక్షించాల్సి రావడంతో బండమీదిపల్లి ప్రజలకు అవసరమైన సమయంలో కార్యదర్శి అందుబాటులో ఉండటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులు, ప్రజల దరఖాస్తులు, ప్రభుత్వ పథకాల అమలు, ఇతర పరిపాలనా వ్యవహారాల కోసం కార్యదర్శిని కలవాల్సి వచ్చినప్పుడు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పాలన నిరంతరాయంగా సాగాలంటే ప్రజలకు అందుబాటులో ఉండే పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి అవసరమని అభిప్రాయపడుతున్నారు.

పింఛన్ల ఆన్‌లైన్ పనులకూ ఇబ్బందులే!

గ్రామంలో పింఛన్లకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ఇతరుల సహకారంతో పూర్తి చేయించాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కీలకమైన ప్రభుత్వ సేవలకు సంబంధించిన పనులే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటే సాధారణ ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడం వల్ల ఏయే పనులు పెండింగ్‌లో ఉన్నాయి? ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అనే అంశాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అధికారుల దృష్టికి సమస్య.. పూర్తిస్థాయి కార్యదర్శిని నియమించాలి!

గ్రామ పంచాయతీ అనేది ప్రజలకు అత్యంత చేరువలో ఉండే పరిపాలనా వ్యవస్థ.అలాంటి వ్యవస్థలో కీలకమైన కార్యదర్శి పోస్టు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం గ్రామాభివృద్ధి, ప్రజాసేవల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బండమీదిపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి, గ్రామపంచాయతీకి పూర్తిస్థాయి కార్యదర్శిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంచార్జి వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపి, గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బండమీదిపల్లి గ్రామపంచాయతీకి పూర్తిస్థాయి కార్యదర్శిని నియమిస్తారా? లేక గ్రామస్తుల ఇబ్బందులు ఇలాగే కొనసాగుతాయా? అన్నది వేచి చూడాలి.

పర్మినెంట్ పంచాయతీ కార్యదర్శిని నియమించండి

బండమీదిపల్లి గ్రామపంచాయతీకి పూర్తిస్థాయి కార్యదర్శి లేకపోవడంతో గ్రామ పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంచార్జి కార్యదర్శి రెండు గ్రామపంచాయతీల విధులు నిర్వహించాల్సి రావడంతో ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం కష్టమవుతోంది. గ్రామస్తుల సమస్యల పరిష్కారం, పంచాయతీ పరిపాలనా పనులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాల్లో జాప్యం జరగకుండా ఉండాలంటే మా గ్రామానికి పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శిని నియమించాలి. సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించి, గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

మానెప్ప బండమీదిపల్లి గ్రామ సర్పంచ్
RELATED ARTICLES
- Advertisment -

Most Popular