- మూడు స్థానాలు.. 30 మందికి పైగా పోటీ.
- సామాజిక సమీకరణాలే కీలకం?
హైదరాబాద్ నవంబర్ 04(ప్రజాక్షేత్రం):తెలంగాణలో గవర్నర్ కోటాలో భర్తీ కావాల్సిన మూడు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ చర్చకు తెరలేపాయి. పదవుల కోసం పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక వర్గాల ప్రతినిధులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. మూడు స్థానాలకు 30 మందికి పైగా నాయకులు ఆశలు పెట్టుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం చేసిన సేవలు, రాజకీయ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ మాదిగ, బీసీ, ఓసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయా వర్గాల నాయకులు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ మాదిగ వర్గం నుంచి దొమ్మేటి సాంబయ్య, ప్రీతమ్ పేర్లు చర్చలో ఉండగా, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, చారుకొండ వెంకటేష్ కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి వేణుగోపాల్ పేరు వినిపిస్తోంది. బీసీ వర్గం నుంచి అనిల్, కైలాష్, జగదీశ్వర్, జక్కని అనిత తదితరులు తమ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు స్థానాలకు ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక సమతుల్యతతో పాటు పార్టీకి చేసిన సేవలు, భవిష్యత్ రాజకీయ అవసరాలను బేరీజు వేసి కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

