రైతుల ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు
మిరుదొడ్డి జూన్ 04(ప్రజాక్షేత్రం):వ్యవసాయ పొలంలో వరి కొయ్యలు తగులబెడు తుండగా జరిగిన ప్రమాదంలో రైతు దుర్మరణం చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దెల మల్లయ్య (60) తన పొలంలో వరి కొయ్యలను తగలబెట్టడానికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున లేచాయి. చూస్తుండగానే పొలం చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. పొగ తీవ్రతకు ఊపిరి పీల్చుకోలేక, తీవ్రమైన వేడి కారణంగా మల్లయ్య స్పృహతప్పి పొలంలోనే పడిపోయారు. అదుపుతప్పిన మంటలు ఆయనకు సైతం అంటుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

