తాళం తెరవరు..!సమయానికి రారు..?
– 11 కావొస్తున్నా కోటగిరి ఎంపీడీవో కార్యాలయానికి తాళం తెరువని వైనం
– సమయపాలన పాటించని అధికారులు..! సమస్యల వలయంలో ప్రజలు..?
కోటగిరి, జులై 03(ప్రజాక్షేత్రం):కోటగిరి మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే అధికారుల తీరు ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. నిత్యం అధికారులు, సిబ్బంది అలసత్వం తో ప్రజా సమస్యల పరిష్కారం కుంటుపడుతుంది. మండల అభివృద్ధికి ప్రణాళికలు రచించాల్సిన అధికారులే అలసత్వంతో ఆలస్యంగా విధులకు రావటం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతుంది. ఇటీవల అధికారుల బదిలీలు జరిగిన అనంతరం దాదాపు చాలామంది సిబ్బంది, అధికారులు కొత్తవారు బదిలీపై రావడంతో కోటగిరి మండల పరిషత్ కార్యాలయం లో ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా మారింది. ఇటు నాయకులతో గానీ అటు ప్రజలతో గాని అధికారులు ఇంకా మమేకం అవ్వకపోవడంతో అధికారులు సమయపాలన పాటించకపోవటం, ఎవరు ఏ సమయానికి వస్తున్నారో తెలియక పనుల కోసం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సమస్యలు తీరక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలు కావస్తున్నప్పటికీ అధికారులు, సిబ్బంది జాడ లేకపోవడం గమనార్హం. ఉదయం 11 గంటల సమయం అవుతున్న కార్యాలయానికి తాళం తీయలేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు సకాలంలో విధులకు రాకపోవడం పక్కన పెడితే ముందుగా వచ్చి పనులు చేయాల్సిన కింది స్థాయి ఉద్యోగులు సైతం సమయానికి రాకపోవడంపై ప్రజలు,నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కోటగిరి మండల పరిషత్ కార్యాలయ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోటగిరి ఎంపీడీవో కార్యాలయం ఉపాధి హామీ విభాగం, మండల పరిషత్ విభాగం లో దాదాపు 10 నుండి 15 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నా ఒక్కరు కూడా సమయానికి రాకపోవడం ఆశ్చర్యానికి గురించేస్తుంది. ప్రజా పాలన కార్యక్రమాలన్నీ ఎంపీడీవో కార్యాలయం నుండే ప్రభుత్వం నిర్వహిస్తున్నందున ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు ఎంపీడీవో కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. అలాంటిది ప్రజా పాలన విధులను గాలికి వదిలేసి ఉదయం 11 కావొస్తున్నా అధికారుల జాడ లేకపోవడంతో పనుల కోసం వచ్చిన ప్రజలు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా కోటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయ అధికారుల తీరు ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. గతంలో కోటగిరి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహించడం వల్ల కార్యాలయం ఉదయం తొమ్మిదింటికే తెరుచుకునేదని ప్రస్తుతం ఆయన వేరే చోటికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల నిత్యం ఇదే తంతు కొనసాగుతుందని ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న అటెండర్ నిజామాబాద్ నుండి నిత్యం రాకపోకలు కొనసాగిస్తుండడంతో ఆఫీసు ఆలస్యంగా తెరుచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఉదయం 11 కావొస్తున్నా ఆఫీసుకి తాళం తీయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కోటగిరి ఎంపీడీవోను వివరణ కోరగా అటెండర్ బయటకు వెళ్లడం వల్ల ఆలస్యమైందని చెప్పడం గమనార్హం. ఆ తర్వాత ఉద్యోగులు, అధికారులు వచ్చారని చెప్తున్నప్పటికీ ఒకరిద్దరు కూడా అధికారులు రాకపోవడం గమనించదగ్గ విషయం.

