సర్ ఫారం సమర్పణలో ప్రజలు భాగస్వాములు కావాలి
తీసుకున్న ప్రతి ఫారం ను నింపి తప్పనిసరిగా తిరిగి అందజేయాలి
32వ వార్డు జిమ్ పార్కులో కొనసాగుతున్న ప్రత్యేక కార్యక్రమం
వనపర్తి, జూలై 18(ప్రజాక్షేత్రం):ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని 32వ వార్డు జిమ్ పార్కు వద్ద శనివారం ఎస్‌ఐఆర్ ఫారం ను నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫారం ను సక్రమంగా ఎలా నింపాలో 32 వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్, బి ఎల్ ఓ శ్రీదేవి, రెవెన్యూ కార్యాలయ జిపిఓ మల్లికార్జున్, అర్ పి అంజనమ్మ ప్రజలకు వివరించి, అవసరమైన చోట సహాయం అందించారు.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నాగన్నయాదవ్ మాట్లాడుతూ, ఓటరు జాబితాను తప్పులులేకుండా రూపొందించేందుకు ప్రతి ఓటరు సహకరించాలని కోరారు. ఇప్పటికే ఎస్‌ఐఆర్ ఫారం తీసుకున్న వారందరూ వాటిని పూర్తిగా, సరైన వివరాలతో నింపి నిర్ణీత గడువులోపు సంబంధిత అధికారులకు తప్పనిసరిగా తిరిగి అందజేయాలని సూచించారు. ఫారం ను సమర్పించడంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని, ఓటరు హక్కును పరిరక్షించుకోవాలంటే ఈ ప్రక్రియలో అందరూ పాల్గొనడం ఎంతో అవసరమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలని, వివరాల్లో ఏవైనా మార్పులు లేదా సవరణలు ఉంటే వాటిని కూడా ఫారం లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా కార్యక్రమం నిర్వహిస్తున్న సిబ్బందిని సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫారం నింపి తిరిగి సమర్పించి ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

