దస్.. బీస్.. తీస్!
- హైదరాబాద్ చుట్టూ 22ఏ భూముల గేమ్..చేంజర్!!
- తెర వెనుక మరో కథ..?
- అసైన్డ్ భూములపై బడా కన్ను..?
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలోని నిషేధిత భూముల జాబితా 22ఏ ఒక్కసారిగా కలకలం రేపుతోంది. వేలాది ఎకరాలు ఈ జాబితాలోకి చేరడంతో సామాన్య ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇళ్లు, కాలనీలు, వ్యవసాయ భూములు సైతం బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నాయనే ప్రచారంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రద్దీ పెరిగింది. “ఎవరికీ అన్యాయం జరగదు. వివాదం లేని భూములను విడుదల చేస్తాం” అని ప్రభుత్వం ప్రకటించినా, తెరవెనుక మరో లెక్కలు నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసైన్డ్ భూములపై బడా కన్ను..?
గత కొన్ని నెలలుగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అసైన్డ్ భూముల వ్యవహారం వేడెక్కింది. రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారులు ఈ భూములపై కన్నేశారు. రైతులకు ఆశలు చూపి ఎకరాకు 40 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ముందస్తు ఒప్పందాలు జరుగుతున్నట్లు సమాచారం. ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
రికార్డుల మార్పే అసలు ఆటలా..?
22ఏ జాబితాలో సవరణలు చేసే పేరుతో రెవెన్యూ రికార్డులు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేందుకు “డేటా కరెక్షన్” పేరుతో దరఖాస్తులు పెడుతున్నారనే ఆరోపణ ఉంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఫోర్త్ సిటీ ప్రాజెక్టు ఆనుకొని ఉండటంతో ఇక్కడ భూములకు గిరాకీ విపరీతంగా పెరిగింది. మహేశ్వరం మండలంలో గత 3 నెలల్లోనే వేల ఎకరాలపై మాటలు కుదిరినట్లు తెలుస్తోంది. శ్రీనగర్ గ్రామంలోని కొన్ని సర్వే నంబర్ల భూములపైనా ఇదే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో మంఖాల్‌లో 47 ఎకరాల రికార్డులు మారాయనే ఆరోపణలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
22ఏ కొత్తది కాదు, కలవరం ఇప్పుడే ఎందుకు?
వాస్తవానికి 22ఏ జాబితా ధరణికి ముందు నుంచే ఉంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కలెక్టర్లు ఈ జాబితాలను ఐజీ రిజిస్ట్రేషన్లకు పంపారు. అవి భూభారతి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కూడా అయ్యాయి. “ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు వెళ్తున్నారు కాబట్టి బయటపడుతోంది” అని అధికారులు చెబుతున్నారు. అయితే నిషేధిత జాబితాలో ఇష్టానుసారంగా పేర్లు చేర్చడం, తమకు కావాల్సిన భూములను తొలగించడం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి.
నగరానికి 15-20 కి.మీ పరిధిలో కోట్ల వ్యాపారం!
హైదరాబాద్ నగరానికి 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఎకరా 10 నుంచి 20 కోట్ల వరకు పలుకుతోంది. అలాంటి చోట అసైన్డ్ భూములను తక్కువ ధరకు చేజిక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరు ప్రముఖులు, రాజకీయ నాయకులు, బినామీల పేర్లతో ఈ డీల్స్ జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.. అధికార వర్గాలు మాత్రం వీటిని ఖండిస్తున్నాయి.
తప్పు చేస్తే చర్యలు తప్పవు..
అధికారుల సీరియస్.. వివరణ..
“నిబంధనల ప్రకారం మాత్రమే చర్యలు ఉంటాయి. తప్పు చేస్తే చర్యలు తప్పవు” అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కానీ లక్ష కోట్ల విలువైన భూములు స్తంభించడంతో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. బ్యాంకు లోన్లు ఆగిపోయాయి, అమ్మకాలు నిలిచిపోయాయి. 22ఏ సవరణ ముసుగులో అసైన్డ్ భూముల పెద్ద ఎత్తున బదలాయింపు జరుగుతుందా? లేక నిజంగానే వివాదరహిత భూములకు న్యాయం జరుగుతుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇది కేవలం భూముల సమస్య మాత్రమే కాదు, ప్రజల నమ్మకానికి సంబంధించిన అంశం..ఇది కేవలం భూమి సమస్య కాదు, ప్రజా నమ్మకానికి యుద్ధం అనేది తెలుస్తుంది.

