ఎస్ఐఆర్ నోటీసులకు స్పందించకుంటే ఓటు గల్లంతు
- నోటీసులు అందుకున్న ఓటర్లు అప్రమత్తం
- 13 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏవైనా రెండింటిని బీఎల్ఓలకు అందజేయాలి
- సర్ ప్రక్రియ తర్వాత పెద్దేముల్ గ్రామంలో 962 ఓట్లు తగ్గింపు
- 60 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులకు ఒక ధ్రువీకరణ పత్రమే సరిపోతుంది
- నిర్ణీత తేదీలో స్పందించకుంటే ఓటు హక్కుకు ముప్పు
- పెద్దేముల్ గ్రామపంచాయతీ కార్యదర్శి జి.లాలప్ప
పెద్దేముల్, సెప్టెంబర్ 02(ప్రజాక్షేత్రం):సర్ ఫేజ్–2 ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, నోటీసుల్లో సూచించిన తేదీల్లో సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలకు) అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా అందజేయాలని పెద్దేముల్ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి జి.లాలప్ప సూచించారు. బుధవారం పెద్దేముల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ గ్రామపంచాయతీ పరిధిలోని 5 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 935 మంది ఓటర్లకు సర్ ఫేజ్–2 నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. అందులో పోలింగ్ స్టేషన్–26లో 205 మందికి, 27లో 256 మందికి, 28లో 152 మందికి, 29లో 159 మందికి, 30లో 163 మంది ఓటర్లకు నోటీసులు అందినట్లు వివరించారు. ఓటర్ల పేర్లలో తప్పులు, వయస్సులో తేడాలు, తండ్రి పేర్లలో వ్యత్యాసాలు, ఆరుగురికి మించి సంతానం ఉన్న కుటుంబాల్లో వయస్సుకు సంబంధించిన తేడాలు తదితర అంశాల ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
రెండు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
నోటీసులు అందుకున్న ఓటర్లు 13 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏవైనా రెండు ధ్రువీకరణ పత్రాలను నోటీసులకు జతచేసి, వారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని లాలప్ప సూచించారు.అయితే 60 సంవత్సరాలు పైబడిన వయస్సు కలిగిన వారు,దివ్యాంగులు 13 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు వాటికి స్పందించకుండా తమ వద్దే ఉంచుకోవడం, నిర్ణీత సమయంలో ధ్రువీకరణ పత్రాలను బీఎల్ఓలకు అందజేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.అర్హతను నిరూపించే పత్రాలు సమర్పించకపోతే సంబంధిత ఓటు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
4,685 నుంచి 3,723కు తగ్గిన ఓటర్ల సంఖ్య
సర్ ప్రక్రియకు ముందు పెద్దేముల్ గ్రామపంచాయతీ పరిధిలోని 5 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 4,685 మంది ఓటర్లు ఉన్నారని లాలప్ప తెలిపారు.వీరిలో 2,380 మంది మహిళలు, 2,305 మంది పురుషులు ఉన్నారని వివరించారు.సర్ ప్రక్రియ అనంతరం ఓటర్ల సంఖ్య 3,723కు చేరిందని,దీంతో గ్రామంలో సుమారు 962 ఓట్లు తగ్గినట్లు తెలిపారు.తగ్గిన ఓట్లలో ఒకే వ్యక్తి పేరుతో రెండుసార్లు నమోదైన పేర్లు, మరణించిన వ్యక్తుల పేర్లు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన (షిఫ్టింగ్) ఓటర్ల పేర్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.అదేవిధంగా 5 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 31 మంది ఓటర్ల వివరాలు సర్ ప్రక్రియలో సరిగ్గా మ్యాపింగ్ కాలేదని తెలిపారు.
నిర్ణీత తేదీలోనే బీఎల్ఓలకు పత్రాలు ఇవ్వాలి
ఓటు హక్కు ఎంతో విలువైనదని, నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా నోటీసులో పేర్కొన్న తేదీని గమనించి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను బీఎల్ఓలకు అందజేయాలని లాలప్ప కోరారు.సర్ ఫేజ్–2 ప్రక్రియలో ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షించేందుకు ఓటర్లు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

