📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రజలను ఇబ్బంది పెట్టొద్దు: సిఎం రేవంత్

ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు: సిఎం రేవంత్

📰 Generate e-Paper Clip

ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు..

  • డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు

హైదరాబాద్, మే 06(ప్రజాక్షేత్రం):డీజీపీ సీవీ ఆనంద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీని సీఎం ఆదేశించారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీకి సూచించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు వద్ద ట్రాఫిక్ జామ్‌పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపి ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

పోలీస్ కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్

సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లతో డీజీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం త్వరలో ‘ట్రాఫిక్ బ్యూరో’ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ పూర్తిగా ఆపకుండా సింగిల్ లైన్‌లో వాహనాలు పంపే ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. రద్దీ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు డీజీపీ సూచించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. వర్షాకాలం ముందు.. నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని.. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ నివారణపై దృష్టి సారించాలన్నారు. ఐఎస్‌డబ్ల్యూ, సీఎస్‌డబ్ల్యూ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. శాంతిభద్రతల విభాగం కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం అవ్వాలని అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular