📄 ePaper
Friday, July 24, 2026
📄 ePaper
Homeతెలంగాణచిర్యాల భూవివాదం కేసులో మరో 14 మంది అరెస్ట్

చిర్యాల భూవివాదం కేసులో మరో 14 మంది అరెస్ట్

📰 Generate e-Paper Clip

చిర్యాల భూవివాదం కేసులో మరో 14 మంది అరెస్ట్

సర్వే నం.156 భూమి వివాదం నేపథ్యంలో దాడి

కీసర, జూన్ 13(ప్రజాక్షేత్రం):మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం చిర్యాల గ్రామంలో చోటుచేసుకున్న భూవివాదానికి సంబంధించిన హత్యాయత్నం కేసులో మరో 14 మంది నిందితులను కీసర పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులు పల్లె భద్రరెడ్డి, బొల్లంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పంజా సంజయ్‌కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. చిర్యాల గ్రామంలోని సర్వే నంబర్ 156లో ఉన్న వివాదాస్పద భూమి విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితులతో కలిసి మరికొందరు వ్యక్తులు ఘటనాస్థలానికి చేరుకుని అక్కడ విధులు నిర్వహిస్తున్న వాచ్‌మన్ గోదుగు సాయికుమార్‌పై దాడికి పాల్పడ్డారు. అతడిని రక్షించేందుకు వచ్చిన బాధితులు, సాక్షులపై కూడా ఇనుప రాడ్లు, హ్యామర్లు, కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి బాధితుల వాంగ్మూలాలు, ప్రత్యక్ష సాక్షుల ప్రకటనలు, స్వాధీనం చేసుకున్న వస్తువులు, సాంకేతిక ఆధారాలను పరిశీలించిన అనంతరం మరో 14 మంది ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని తెలిపారు. అనంతరం ప్రత్యేక బృందాలు వారిని గుర్తించి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు వెల్లడించారు. ఈ కేసులో జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి పర్యవేక్షణలో కీసర ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు, దర్యాప్తు అధికారి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో మరికొంత మంది నిందితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. భూ, సివిల్ వివాదాలను కోర్టులు లేదా రెవెన్యూ చట్టాల పరిధిలోనే పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. భూమి వివాదాల పేరుతో రౌడీలను సమీకరించి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమితో ఎలాంటి సంబంధం లేకున్నా డబ్బుకు ఆశపడి ఇటువంటి ఘటనల్లో పాల్గొనే వ్యక్తులు జైలుశిక్షతో పాటు రౌడీషీట్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని డీసీపీ సి.హెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular