మరో అవినీతి చేప… అనీశాకు పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి
ఖమ్మం జిల్లా జూన్ 27(ప్రజాక్షేత్రం):ముదిగొండ మండలం భానాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ ఫిర్యాదుదారుడి నుంచి రూ.25,000 లంచండిమాండ్ చేసి తీసుకుంటుండగా ఖమ్మం అవినీతి నిరోధక శాఖ(అనీశా)కు రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి ఇంటి స్థలంలో నిర్మిస్తున్న ఒక గది రేకుల షెడ్‌కు భవన అనుమతి ప్రక్రియ పూర్తి చేయడం, ఇంటి నంబర్ కేటాయించడం కోసం పంచాయతీ కార్యదర్శి లంచం కోరినట్లు అనీశా అధికారులు తెలిపారు. ముదిగొండ మండలంలోని రైతు వేదిక సమీపంలో లంచం స్వీకరిస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్ము రూ.25,000 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శిని అరెస్ట్ చేసి వరంగల్‌లోని ఎస్పీఈ, అనీశా కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

