📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణమళ్లీ మన బడిలో… జ్ఞాపకాల మహా సంగమం

మళ్లీ మన బడిలో… జ్ఞాపకాల మహా సంగమం

📰 Generate e-Paper Clip

మళ్లీ మన బడిలో… జ్ఞాపకాల మహా సంగమం

  • 50 ఏళ్ల బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై
  • కొండ విజయ్ కుమార్, బొబ్బిలి ప్రవీణ్, ఏగూరి మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఘన విజయం

షాబాద్, జూన్ 13(ప్రజాక్షేత్రం):కాలం మారినా… తరాలు మారినా… పాఠశాలతో పెనవేసుకున్న అనుబంధం మాత్రం ఎన్నటికీ చెరగదని జడ్పీహెచ్‌ఎస్ షాబాద్‌లో నిర్వహించిన సమస్త పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం మరోసారి చాటిచెప్పింది. దాదాపు 50 సంవత్సరాలకు చెందిన వివిధ బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం అరుదైన ఘట్టంగా నిలిచింది. చిన్ననాటి స్నేహాలు, గురువుల జ్ఞాపకాలు, పాఠశాల అనుభూతులను గుర్తుచేసుకుంటూ పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. హోఫ్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్, బొబ్బిలి ప్రవీణ్, ఏగూరి మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం షాబాద్ విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడం వెనుక ఈ ముగ్గురి దూరదృష్టి, సమన్వయం, అంకితభావం ప్రధాన కారణమని పాల్గొన్నవారు కొనియాడారు. ఈ సందర్భంగా కొండ విజయ్ కుమార్ మాట్లాడుతూ, “పాఠశాల అనేది కేవలం చదువుకునే స్థలం కాదు.. జీవితానికి పునాది వేసే దేవాలయం. మనం ఎంత ఎదిగినా మన మూలాలను, మన గురువులను, మన పాఠశాలను మరవకూడదు” అని అన్నారు. 50 సంవత్సరాల బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులను ఒకే వేదికపై కలపడం తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ మహాసమ్మేళనం విజయవంతం కావడంలో కొండ విజయ్ కుమార్‌తో పాటు బొబ్బిలి ప్రవీణ్, ఏగూరి మల్లికార్జున్ పాత్ర విశేషంగా నిలిచింది. నెలల తరబడి పూర్వ విద్యార్థులను సంప్రదించడం, వివిధ బ్యాచ్‌లను సమన్వయం చేయడం, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం వంటి అంశాల్లో వారు అసాధారణ ప్రతిభ కనబరిచారు. పాఠశాలపై ఉన్న ప్రేమ, పూర్వ విద్యార్థుల మధ్య ఐక్యతను పెంపొందించాలనే సంకల్పమే ఈ కార్యక్రమానికి ప్రాణంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా 50 సంవత్సరాల బ్యాచ్‌లను ఒకే వేదికపైకి తీసుకురావడం సాధారణ విషయం కాదని, ఈ అరుదైన ఘనత కొండ విజయ్ కుమార్, బొబ్బిలి ప్రవీణ్, ఏగూరి మల్లికార్జున్‌లకే దక్కుతుందని పూర్వ విద్యార్థులు ప్రశంసించారు. వారి నాయకత్వం, సేవా దృక్పథం, పాఠశాలపై ఉన్న మమకారం కారణంగానే ఈ మహా కలయిక సాధ్యమైందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ జీవిత విజయాలకు పాఠశాల, ఉపాధ్యాయులే పునాది అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని తీర్మానించారు. వందలాది మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్న ఈ మహా సమ్మేళనం షాబాద్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమంగా నిలిచింది. 50 సంవత్సరాల బ్యాచ్‌ల జ్ఞాపకాలను ఒక్కచోట చేర్చి, తరాల మధ్య అనుబంధానికి వారధిగా నిలిచిన ఈ కార్యక్రమం అందరి హృదయాలను తాకింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular