📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్నిద్రిస్తున్న మహిళలే లక్ష్యం.. సీరియల్ దొంగ అరెస్ట్

నిద్రిస్తున్న మహిళలే లక్ష్యం.. సీరియల్ దొంగ అరెస్ట్

📰 Generate e-Paper Clip

రూ.10 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం

మార్కాపురం, జూలై 10(ప్రజాక్షేత్రం):జిల్లాలో మహిళల మెడలో బంగారు గొలుసులు అపహరించడం, తాళం వేసిన దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న సీరియల్ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 83 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. బేస్తవారిపేట మండలం పాపాయపల్లి గ్రామంలో ఇంటి వద్ద నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించిన ఘటనతో పాటు, ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లు, పూరిమెట్ల గ్రామాల్లో దోమతెరల్లో నిద్రిస్తున్న మహిళల మెడల్లోని గొలుసులను దొంగిలించాడు. అలాగే నాగులుప్పలపాడు మండలంలోని తాళం వేసిన ఓ షాపులో నగదు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, డీఎస్పీ యు. నాగరాజు పర్యవేక్షణలో కంభం సీఐ కె. మల్లికార్జున, బేస్తవారిపేట ఇన్‌చార్జి ఎస్సై ఏ. శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి జూలై 9న కోనపల్లి క్రాస్‌రోడ్డు వద్ద నిందితుడిని అరెస్టు చేసింది. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నల్లతుమ్మాయపల్లికి చెందిన గురునాధం బ్రహ్మయ్య (24) మద్యం తదితర దురలవాట్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిపై తెలంగాణలోని రేవల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు వెంకటగిరి, దక్కిలి, సుళ్లూరుపేట పోలీస్ స్టేషన్లలోనూ చోరీ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular