డాక్టర్ పేరుతో దందా..సూరారంలో బోగస్ క్లినిక్ బట్టబయలు
- కుత్బుల్లాపూర్ ఎస్‌వోటీ–సూరారం పోలీసుల సంయుక్త దాడి
- మెడికల్ అర్హతలు లేకుండానే ఏడాదిగా వైద్యం
- నిందితుడిపై కేసు నమోదు..దర్యాప్తు ముమ్మరం
కుత్బుల్లాపూర్, ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):వైద్య సేవల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బోగస్ క్లినిక్‌పై సూరారం పోలీసులు, కుత్బుల్లాపూర్ ఎస్‌వోటీ బృందం సంయుక్తంగా దాడి చేసి నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 31న విశ్వసనీయ సమాచారం మేరకు వెంకటరామ నగర్‌లోని బచ్‌పన్ స్కూల్ సమీపంలో నిర్వహిస్తున్న “రక్షిత క్లినిక్”లో తనిఖీలు నిర్వహించగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, సనాది కర్ణాకర్ (35) ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేదా చట్టబద్ధమైన లైసెన్స్ లేకుండానే డాక్టర్‌గా చెలామణి అవుతూ సుమారు ఏడాది కాలంగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. రోగులను పరీక్షించడం, మందులు ఇవ్వడం, కన్సల్టేషన్ ఫీజులు వసూలు చేయడంతో పాటు మందుల విక్రయం ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి నకిలీ వైద్యుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున, వైద్య సేవలు పొందే ముందు వైద్యుడి అర్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్‌ను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు. తమ ప్రాంతాల్లో బోగస్ క్లినిక్‌లు లేదా నకిలీ వైద్యులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.


