భూ వివాదం, పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు
విశాఖపట్నం, జూలై 31(ప్రజాక్షేత్రం):గాజువాక సనత్‌నగర్‌కు చెందిన అనురాధ శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తనకు చెందిన స్థలం విషయంలో పలువురు వ్యక్తులు, కొందరు ప్రభుత్వ అధికారులు, పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులను కోరారు. అనురాధ మాట్లాడుతూ.. సనత్‌నగర్‌లో సర్వే నంబర్ 186/1లోని 400 గజాల స్థలం లోక్ అదాలత్‌లో ఎల్‌ఏసీ నంబర్ 71/2024 (ఓఎస్ నంబర్ 6/2024) ద్వారా తనకు వచ్చిందని, అనంతరం రుణం పూర్తిగా చెల్లించి స్థలాన్ని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని తెలిపారు. అయితే, 2025 మార్చి 14న బల్గా బాలు నాయుడు, కురందాస్ కృష్ణ, గురునాయుడు తదితరులు తన స్థలంలోకి బలవంతంగా ప్రవేశించి స్థలాన్ని లెవెలింగ్ చేయడంతో పాటు కాంపౌండ్ వాల్ కూల్చివేశారని ఆరోపించారు. తనను దుర్భాషలాడడంతో పాటు కులం పేరుతో దూషించారని తెలిపారు. మరుసటి రోజు టీ. మాధవిని తీసుకొచ్చి మరోసారి గొడవకు దిగారని చెప్పారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇది సివిల్ వివాదమని పేర్కొంటూ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. అనంతరం స్థలంలో కంటైనర్ ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ పొందినప్పటికీ, మార్చి 17న మళ్లీ కొందరు వ్యక్తులు వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. దీనిపై వీడియో ఆధారాలతో మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా, తాజా ఫిర్యాదు స్వీకరించి, ప్రాథమిక ఆధారాలు ఉంటే కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. అయితే ఆ ఉత్తర్వులను కూడా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. మార్చి 27న పోలీసులు, కొందరు వ్యక్తులతో కలిసి తన స్థలంలో ఉన్న కంటైనర్‌ను తొలగించారని, అనంతరం ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విద్యుత్ మీటర్‌ను కూడా తీసుకెళ్లారని తెలిపారు. అయినప్పటికీ తాను విద్యుత్ బిల్లులు చెల్లిస్తూనే ఉన్నానని చెప్పారు. టీ. మాధవి తనపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని, స్థలం యాజమాన్యంపై సంబంధిత సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించిందని తెలిపారు. అనంతరం సివిల్ కోర్టులో కేసు కొనసాగుతోందని చెప్పారు. 2026 ఫిబ్రవరి 3న బల్గా బాలు నాయుడు, టీ. మాధవి తదితరులు 30 నుంచి 40 మంది వ్యక్తులతో కలిసి తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని, బంగారు గొలుసు లాక్కున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని వెంటనే పోలీస్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా తెలియజేసి, వాట్సాప్‌లో వీడియోలు పంపినట్లు చెప్పారు. కమిషనర్ సూచన మేరకు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని, అనంతరం ఏసీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే, తన ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోకుండా, తనపైనే తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ తప్పుడు కేసు అని, ప్రత్యర్థులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారని అన్నారు. తన స్థలంలో రాత్రి సమయంలో పోలీసుల సమక్షంలోనే నిర్మాణ పనులు జరిగాయని, దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్, డీజీపీ కార్యాలయం, ఇతర ఉన్నతాధికారులకు కూడా పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని అనురాధ తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సైట్ విజిట్, విచారణలను కూడా నిలిపివేశారని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను పలుమార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చానని, తనకు భరోసా కల్పించే బదులుగా భయపెట్టే విధంగా మాట్లాడారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. తనకు లేదా తన కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రాణహాని జరిగితే అందుకు బాధ్యులు సంబంధిత వ్యక్తులేనని అనురాధ ఆరోపించారు. తన ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి నిష్పాక్షిక విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
గమనిక ఈ వార్తలో పేర్కొన్న అంశాలు ప్రెస్‌మీట్‌లో అనురాధ చేసిన ఆరోపణలు మాత్రమే. వీటిపై సంబంధిత వ్యక్తులు, అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

