నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం….బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి
- అడికిచెర్ల ఉన్నత పాఠశాలలో వైభవంగా బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ
- ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి
- 150 కిలోమీటర్ల ప్రయాణం…..31 ఏళ్ల విద్యాసేవ
- సమయపాలన, సేవాభావానికి ప్రతీకగా నిలిచిన ఉపాధ్యాయుడు బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి
- విద్యాబోధనలో ఆదర్శంగా నిలిచిన బసిరెడ్డికి ఘన సన్మానం
- 31 ఏళ్ల బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అంకితభావానికి అపూర్వ గౌరవం
పెద్దేముల్, ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):ఉద్యోగ జీవితంలో ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజమైన ఘట్టమే అయినప్పటికీ, సమాజానికి ఆదర్శప్రాయమైన సేవలు అందించిన వారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పెద్దేముల్ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) నర్సింగ్ రావు, వికారాబాద్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి రామ్ మస్తా, అడికిచర్ల గ్రామ సర్పంచ్ మ్యాతరి యశోద, మాజీ ఎంపీటీసీ ధన్ సింగ్, అడికిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండురంగం లు పేర్కొన్నారు. శనివారం అడికిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి ఘనంగా ఉద్యోగ విరమణ అభినందన సభను నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, అడికిచెర్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొని ఆయనను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా దాదాపు 31 సంవత్సరాల పాటు అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత, ఆత్మవిశ్వాసంతో సేవలందించి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. ప్రతిరోజూ సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, పాఠశాల ప్రార్థన సమయానికే హాజరై విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేశారని ప్రశంసించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన 1995 జూన్ 11న ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించి, తన ఉద్యోగ జీవితమంతా విద్యార్థుల అభివృద్ధియే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారని తెలిపారు.ఆయన బోధన, క్రమశిక్షణ, నిబద్ధత, ఆత్మ విశ్వాసం, అంకితభావం, సేవా దృక్పథం ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పదవీ విరమణ పొందుతున్నప్పటికీ, ఆయన అందించిన విద్యాసేవలు, విలువలు, మార్గదర్శకత్వం విద్యార్థులు, సహచర ఉపాధ్యాయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అభినందించారు. పదవీ విరమణ సభలో భావోద్వేగంగా బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ….ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పదవీ విరమణ పొందుతున్న ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. తాను వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి చిన్ననాటి నుంచే చదువులపై ఆసక్తి పెంచుకుని, ఎంతో కష్టపడి చదివి 1995 జూన్ 11న ఉపాధ్యాయ వృత్తిలోకి ఎస్జీటీ గా అడుగుపెట్టానని తెలిపారు.తన ఉద్యోగ జీవితమంతా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేశానని చెప్పారు. 2001లో పదోన్నతి పొంది మోమిన్ పేట్ బాలుర ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యానని, అనంతరం దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ప్రతిరోజూ సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ,ప్రతి రోజు ఉదయం 5:15 నిముషాలకు ఇంటి నుండి బయలుదేరి రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగి వెళుతూ ప్రతి రోజు పాఠశాల ప్రార్థన సమయానికే హాజరై ఉత్సాహంగా విద్యార్థులకు పాఠాలు బోధించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.
అడికిచెర్ల ప్రాంతం తన హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని, ఇక్కడి విద్యార్థుల, గ్రామస్తుల ప్రేమాభిమానాలు,ఆప్యాయతలు జీవితాంతం మరువలేనివని భావోద్వేగంతో చెప్పారు. 31 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం దక్కడం తన అదృష్టమని పేర్కొన్నారు. అడికిచెర్ల ఉన్నత పాఠశాలలో సహచర ఉపాధ్యాయులు కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేస్తున్నారని, ప్రధానోపాధ్యాయులు పాండురంగం తన అద్భుతమైన పరిపాలనా నైపుణ్యాలతో పాఠశాలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు. చివరగా, తన 31 ఏళ్ల ఉద్యోగ జీవితంలో తనకు అండగా నిలిచిన స్నేహితులు, ఆత్మీయులు, అభిమానులు, సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువజన సంఘాల నాయకులు, అడికిచెర్ల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఊరేంటి తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.వారి సహకారం వల్లే తన ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడికిచర్ల గ్రామ సర్పంచ్ మ్యాతరి యశోద అనందం,ఉప సర్పంచ్ ఎల్లప్ప,మాజీ ఎంపీటీసీ ధన్ సింగ్,పెద్దేముల్ మండల ఎంఈఓ నర్సింగ్ రావు, వికారాబాద్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రామ్ మస్తా, తట్టేపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం జోజప్ప, అడికిచర్ల ప్రధానోపాధ్యాయులు పాండు రంగం, ఊరేంటి తండా ప్రధానోపాధ్యాయులు వినయ్, పెద్దేముల్ మండల శాఖ పీఆర్టీయూ ప్రెసిడెంట్ పోల నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి బక్క వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు బందెప్ప, యూటీఎఫ్ నాయకులు సలీం, గ్రామ పెద్దలు వెంకట్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఫకృద్దీన్, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ మహబూబ్, ఏఏపీసీ చైర్మన్ హేమలత, పంచాయతీ కార్యదర్శి మొగులేష్, ఆయా గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు,స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, బసి రెడ్డి సత్యనారాయణ రెడ్డి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, అడికిచర్ల గ్రామస్థులు, సహచర ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



