📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeఆర్టికల్స్పొలాన్ని చదివిన కమ్యూనిస్టుకామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి

పొలాన్ని చదివిన కమ్యూనిస్టుకామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి

📰 Generate e-Paper Clip

పొలాన్ని చదివిన కమ్యూనిస్టు
కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి

రైతు గురించి మాట్లాడేవారు.. రైతు సమస్యలపై పోరాడేవారు అనేకమంది ఉంటారు. కానీ, రైతు జీవితాన్ని అధ్యయనం చేసి, ఆ జీవితాన్ని నిర్దేశించే సామాజిక ఆర్థిక సంబంధాలను అర్థం చేసుకుని, ఆ అవగాహనను నిరంతర ప్రజా ఉద్యమంగా మలిచిన నాయకులు చాలా అరుదు. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి అలాంటి కమ్యూనిస్టు నాయకుడు. ఆయన జీవితాన్ని ఒక వ్యక్తి జీవితచరిత్రగా చూస్తే సరిపోదు. తెలంగాణ గ్రామీణ సమాజంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎదిగిన తీరు, రైతాంగ పోరాటం పరిణామం, వ్యవసాయ రంగంపై మారుతున్న ప్రభుత్వ విధానాలు, వాటిపై ఒక మార్క్సిస్టు నాయకుడు సాగించిన అధ్యయనం – పోరాటం ఈ సమస్తాన్ని కలిపి చూస్తేనే ఆయన జీవితానికి సరైన అర్థం లభిస్తుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలోని తిమ్మంపేట గ్రామంలో పుట్టి పెరిగిన మల్లారెడ్డి బాల్యంలోనే గ్రామీణ సమాజంలోని అసమానతలను చూశారు. భూస్వాములు, కరణాలు, మాలి పటేళ్ల ఆధిపత్యం, పేదలపై పెత్తనం, గ్రామీణ జీవితంలో వర్గ విభజన లాంటివన్నీ ఆయన రాజకీయ చైతన్యానికి నేపథ్యంగా నిలిచాయి. 1961లో గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడటం, 1962 ఎన్నికల్లో పేద ప్రజలు కమ్యూనిస్టు అభ్యర్థిని గెలిపించడం ఆయనపై ప్రభావం చూపాయి. 1964లో కమ్యూనిస్టు పార్టీ విభజన తర్వాత ఏర్పడిన సీపీఐ(ఎం)లో ఆయన చేరారు. అప్పటి నుంచి ఆయన జీవితం పార్టీతో, ప్రజలతో, ముఖ్యంగా రైతాంగ ఉద్యమంతో ముడిపడిపోయింది. ఆయనకు పాఠశాల విద్య ఎక్కువగా దక్కలేదు. పదో తరగతి తర్వాత చదువు కొనసాగలేదు. అయితే అక్కడితో వారి అధ్యయనం ఆగలేదు. పుస్తకాలు ఆయనకు విశ్వవిద్యాలయాలయ్యాయి. గ్రామం పాఠశాల అయింది. రైతు జీవితం పాఠ్యాంశమైంది. ఉద్యమం రాజకీయ విద్యను అందించింది. మార్క్సిజాన్ని ఆయన కేవలం సిద్ధాంతంగా చదవలేదు. భూమి, కౌలు, అప్పు, ధర, మార్కెట్, శ్రమ వంటి వాస్తవ జీవిత సమస్యలతో అనుసంధానించి అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన ప్రసంగాల్లో నినాదం కంటే వాస్తవాలు ఎక్కువగా కనిపిస్తాయి. రచనల్లో భావోద్వేగం కంటే అధ్యయనం బలంగా ఉంటుంది.

ఆ అధ్యయనం వ్యవసాయ రంగానికే పరిమితం కాలేదు. సాహిత్యంపై కూడా ఆయనకు మంచి పట్టు సాధించారు. దీన్ని నేను స్వయంగా అనుభవించాను. 2011లో నేను రాసిన ‘వికసించని మందారాలు’ కవితా సంపుటిని ఆయనకు అందించినప్పుడు, పుస్తకాన్ని కేవలం ఒకసారి తిప్పి చూసినట్టు కాదు, కవితల అంతరార్థాన్ని, సామాజిక నేపథ్యాన్ని, వాటిలోని భావప్రవాహాన్ని పరిశీలించారు. దాదాపు పది నిమిషాల్లోనే పుస్తకంపై తన అవగాహనను ఏర్పరచుకున్నారు. మరో పది నిమిషాల్లో ఆ పుస్తకానికి ముందుమాట రాశారు. ఆ వేగం కేవలం రచనా చాతుర్యానికి సూచిక కాదు. చదివినదాన్ని వెంటనే గ్రహించి, దాని సారాన్ని పట్టుకుని, అవసరమైన మాటలో వ్యక్తీకరించగల అధ్యయనశీలతకు అది నిదర్శనం. ‘వికసించని మందారాలు’కు ఆయన రాసిన ముందుమాట నాకు వ్యక్తిగతంగా ఒక జ్ఞాపకం మాత్రమే కాదు. మల్లారెడ్డి సాహిత్య దృష్టికి కూడా ఒక చిన్న సాక్ష్యం. రైతాంగం, వ్యవసాయం, రాజకీయాలు, చరిత్ర వంటి విస్తృత రంగాల్లో ఆయనకు ఉన్న పరిజ్ఞానంతో పాటు సాహిత్యాన్ని కూడా సామాజిక జీవితంతో అనుసంధానించి చూడగలిగిన దృష్టి ఆయనలో ఉంది. కవిత్వాన్ని కేవలం పదాల అలంకారంగా కాకుండా సమాజం పట్ల రచయితకు ఉన్న స్పందనగా చూడగలిగారు. ఒక యువ లేదా సమకాలీన రచయిత రచనలోని సామాజిక అంతస్సారాన్ని గుర్తించి, దానిని ప్రోత్సహించడానికి ముందుమాట రాయడం ఆయనలోని సాహిత్య సంస్కారానికి నిదర్శనం.

ఇక్కడే మల్లారెడ్డి వ్యక్తిత్వంలోని మరో కోణం కనిపిస్తుంది. సాధారణంగా రాజకీయ నాయకుడి అధ్యయనం రాజకీయ పుస్తకాల వరకే పరిమితమవుతుంది. కానీ ఆయన పఠన పరిధి విస్తృతమైనది. వ్యవసాయ విధానాలపై నివేదికలు చదివిన వ్యక్తే సాహిత్యాన్ని కూడా అంతే శ్రద్ధగా చదవగలిగారు. చరిత్రను పరిశీలించిన వ్యక్తే కవిత్వంలోని మానవీయ స్పందనను గుర్తించగలిగారు. ఈ విస్తృత పఠనమే ఆయన మాటలకు లోతును ఇచ్చింది. తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్న కాలంలో మల్లారెడ్డి రాజకీయ జీవితం మరింత పదునెక్కింది. 1970 – 80 దశకాల్లో వరంగల్ ప్రాంతంలో సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులు, హత్యలు, కేసులు, అరెస్టులు కొనసాగాయి. ఆయన స్వయంగా అజ్ఞాత జీవితాన్ని అనుభవించారు. ప్రజల కోసం పనిచేసే కార్యకర్తకు నిర్బంధం కొత్త విషయం కాదు. నిర్బంధం మధ్య కూడా రాజకీయ నిబద్ధతను నిలబెట్టుకోవడం ఉద్యమకారుడి అసలు పరీక్ష. ఆ పరీక్షను ఆయన దాటారు. అధికారం కోసం రాజకీయాన్ని ఎంచుకోలేదు. ప్రజల మధ్య ఉండటానికే రాజకీయాన్ని ఎంచుకున్నారు.

మల్లారెడ్డి జీవితానికి రైతాంగ ఉద్యమం కేంద్రబిందువు. తెలంగాణలో రైతు సంఘం నిర్మాణం నుంచి అఖిల భారత కిసాన్ సభ నాయకత్వం వరకు ఆయన ప్రయాణం సాగింది. రైతు సమస్యలను రాష్ట్ర సరిహద్దుల్లో బంధించకుండా జాతీయ వ్యవసాయ విధానాల ప్రశ్నగా ముందుకు తీసుకెళ్లారు. అఖిల భారత కిసాన్ సభలో జాతీయ స్థాయి బాధ్యతలు నిర్వహించారు. ఇది ఒక పదవి కాదు. దేశంలోని వివిధ ప్రాంతాల రైతాంగ సమస్యలను సమగ్రంగా చూడాల్సిన బాధ్యత. పంజాబ్ రైతు, తెలంగాణ రైతు, బీహార్ కౌలు రైతు, కేరళ చిన్న రైతు వారి పరిస్థితుల్లో తేడాలున్నా భూమి, మార్కెట్, రుణం, ధర, ఉత్పత్తి వ్యయం, ప్రభుత్వ విధానాల ప్రశ్నల్లో ఉన్న సంబంధాలను ఆయన గుర్తించారు. రైతు అంటే ఒకే వర్గం కాదని ఆయన రాజకీయ అవగాహన స్పష్టం చేసింది. భూస్వామి, ధనిక రైతు, మధ్యతరగతి రైతు, సన్నకారు రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికుడు, వారి ప్రయోజనాలు ఒకేలా ఉండవు. రైతాంగ సమస్యను అర్థం చేసుకోవాలంటే గ్రామీణ వర్గ సంబంధాలను అర్థం చేసుకోవాలి. భూమి ఎవరి చేతిలో ఉంది? సాగు చేసేది ఎవరు? పంటకు పెట్టుబడి ఎవరిది? కౌలు ఎంత? అప్పు ఎక్కడి నుంచి వస్తోంది? పంటను ఎవరు కొనుగోలు చేస్తున్నారు? ధరను ఎవరు నిర్ణయిస్తున్నారు? ఈ ప్రశ్నలే రైతు సంక్షోభం వెనుక ఉన్న వాస్తవాన్ని బయటపెడతాయి. అందుకే ఆయనకు రైతు సమస్య అంటే కేవలం పంట ధర సమస్య కాదు. అది భూమి సమస్య. కౌలు హక్కుల సమస్య. రుణ సమస్య. నీటి సమస్య. మార్కెట్ సమస్య. ప్రభుత్వ కొనుగోలు సమస్య. వ్యవసాయ కార్మికుడి ఉపాధి సమస్య. వ్యవసాయ ఉత్పత్తిపై కార్పొరేట్ ఆధిపత్యాన్ని అడ్డుకునే ప్రశ్న. రైతు జీవితాన్ని ప్రభావితం చేసే ఈ అంశాలన్నింటినీ కలిపి చూడటం ఆయన రాజకీయ దృష్టిలోని ప్రధాన బలం.

కనీస మద్దతు ధర కోసం ఆయన చేసిన పోరాటం కూడా ఇదే దృక్పథంలో భాగం. రైతు పంటను ఉత్పత్తి చేస్తాడు. కానీ ఆ పంటకు ధరను రైతు నిర్ణయించడు. విత్తనాల ధరను కంపెనీలు నిర్ణయిస్తాయి. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరుగుతాయి. బ్యాంకు రుణం రైతు మీద వడ్డీ భారాన్ని పెడుతుంది. మార్కెట్‌లో పంట ధర పడిపోతుంది. చివరికి ఉత్పత్తి చేసిన రైతే నష్టపోతాడు. ఈ విరోధాన్ని పరిష్కరించకుండా రైతు సంక్షోభానికి శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని ఆయన నిరంతరం వాదించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనంగా రైతుకు ధర లభించాలన్న డిమాండ్‌ను ఆయన బలంగా ముందుకు తెచ్చారు. ఇది కేవలం ధర పెంచమనే డిమాండ్ కాదు. రైతు ఉత్పత్తికి సముచిత విలువ ఇవ్వాలనే ప్రశ్న. ప్రభుత్వం రైతును మార్కెట్ దయకు వదిలేయకుండా బాధ్యత తీసుకోవాలనే ప్రశ్న. కౌలు రైతుల సమస్యపై కూడా ఆయన స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. భూమి స్వంతం లేని వ్యక్తి సాగు చేస్తే అతను రైతు కాదా? భూమి పట్టా పేరులో ఉన్నవారికే ప్రభుత్వ సహాయం అందితే వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతు పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా రైతు సంక్షేమం గురించి మాట్లాడటం అసంపూర్ణం. కౌలు రైతుకు గుర్తింపు, రుణం, బీమా, పంట నష్టం పరిహారం, సాగు హక్కులు కల్పించాలన్న డిమాండ్ రైతాంగ ఉద్యమంలో ఆయన నిరంతరం ముందుకు తెచ్చిన అంశం. 2020 – 21లో దేశాన్ని కుదిపేసిన మూడు వ్యవసాయ చట్టాల వ్యతిరేక రైతాంగ ఉద్యమంలో కూడా ఆయన తెలంగాణ నుంచి బలమైన స్వరం వినిపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ ఆధిపత్యానికి తెరిచే విధానాలను ఆయన వ్యతిరేకించారు. రైతు ఉత్పత్తి, మార్కెట్, ధరలపై ప్రభుత్వ బాధ్యత తగ్గి, కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెరిగితే చిన్న, సన్నకారు రైతు మరింత అసురక్షితుడవుతాడని హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెలల తరబడి పోరాడినప్పుడు తెలంగాణలో కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా రైతులను సమీకరించడంలో ఆయన భాగస్వామ్యం అయ్యారు.

వ్యవసాయంలో కార్పొరేట్ జోక్యాన్ని ఆయన కేవలం కొనుగోలు, అమ్మకాలకే పరిమితం చేసి చూడలేదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మార్కెటింగ్, రుణం – వ్యవసాయ ఉత్పత్తి గొలుసులోని ప్రతి దశలో పెరుగుతున్న ప్రైవేటు ఆధిపత్యాన్ని ఆయన పరిశీలించారు. అధిక ఎరువుల వినియోగం వెనుక ఉన్న వాణిజ్య ప్రయోజనాలను ప్రశ్నించారు. రైతు శాస్త్రీయ వ్యవసాయం చేయాలి అంటే శాస్త్రీయ సలహా కూడా కంపెనీల మార్కెటింగ్ ప్రయోజనాలకు అతీతంగా ఉండాలని ఆయన పట్టుదలగా చెప్పారు. మల్లారెడ్డి మరో విశిష్టత ఆయన రచనా కృషి. ఆయనకు రచన ప్రచారం కోసం కాదు. ఉద్యమానికి జ్ఞానాన్ని సమకూర్చేందుకు. భారతదేశ రైతు ఉద్యమాల చరిత్ర నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకు ఆయన అధ్యయనం చేశారు. రైతు ఉద్యమాల చరిత్రను నమోదు చేయడం ద్వారా నేటి పోరాటాలను గత పోరాటాల అనుభవాలతో అనుసంధానించారు. చరిత్ర ఆయనకు గతాన్ని స్మరించుకోవడానికి కాదు; వర్తమాన పోరాటానికి దిశను కనుగొనడానికి అవసరమైన సాధనం.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై ఆయన చేసిన రచనలు ఈ దృష్టిని ప్రతిబింబిస్తాయి. రైతాంగ పోరాటాన్ని కేవలం వీరగాథగా కాకుండా, భూమి, వెట్టి, భూస్వామ్య ఆధిపత్యం, ప్రజా ప్రతిఘటన, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం వంటి సామాజిక, ఆర్థిక అంశాలతో చూడాల్సిన అవసరాన్ని ఆయన రచనలు గుర్తుచేస్తాయి. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలకు సమాధానం కూడా చరిత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేయడమేనన్న అవగాహన ఆయనలో బలంగా ఉంది. మల్లారెడ్డి జీవితంలో అధ్యయనం ఒక అలవాటు కాదు. అది రాజకీయ క్రమశిక్షణ. బడ్జెట్ చదవాలి. వ్యవసాయ విధానాలు చదవాలి. చట్టాలు చదవాలి. ప్రభుత్వ గణాంకాలు చూడాలి. రైతుతో మాట్లాడాలి. గ్రామానికి వెళ్లాలి. పంటను చూడాలి. అప్పు నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే రైతు సమస్యపై మాట్లాడాలి. ఈ పద్ధతి ఆయనను కేవలం వేదికలపై ప్రసంగించే నాయకుడి స్థాయి నుంచి అధ్యయనశీలి అయిన ప్రజా నాయకుడి స్థాయికి తీసుకెళ్లింది. ఆయన జీవితంలోని మరో విశేషం వయసు. దశాబ్దాల ఉద్యమం తర్వాత కూడా ప్రజా జీవితానికి దూరం కాలేదు. కరోనా కాలంలో కూడా రైతుల సమస్యలపై ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఎనభై దాటిన వయసులోనూ వ్యవసాయ రంగంపై పుస్తకాలు రాశారు, రైతు సమస్యలపై మాట్లాడారు, ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వయసు పెరిగేకొద్దీ శరీరం నెమ్మదించవచ్చు; కానీ ప్రజల పట్ల బాధ్యత తగ్గకూడదనే జీవన సందేశాన్ని ఆయన ఆచరణలో చూపించారు.

ఇటీవలి కాలంలో కూడా రైతు సంఘం కార్యకర్తలకు స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని, భూ సమస్యలను పట్టించుకోవాలని, ప్రతి కార్యకర్త అధ్యయనం పెంచుకోవాలని ఆయన ఇచ్చిన పిలుపు ఆయన రాజకీయ జీవితానికి కొనసాగింపే. ఉద్యమం అంటే పెద్ద సభలు, పెద్ద నినాదాలు మాత్రమే కాదని, గ్రామంలో రైతు ఎదుర్కొంటున్న ఒక భూ సమస్యను పట్టుకోవడం నుంచి ఉద్యమం ప్రారంభమవుతుందని ఆయన అనుభవం చెబుతోంది. సారంపల్లి మల్లారెడ్డిని సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడిగా మాత్రమే గుర్తించడం సరికాదు, ఆయన తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక తరం అనుభవాన్ని మోసుకొచ్చిన నాయకుడు. రైతాంగ ఉద్యమంలో దీర్ఘకాలం పనిచేసిన నిర్వాహకుడు. అఖిల భారత కిసాన్ సభలో జాతీయ స్థాయి నాయకుడు. వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసిన ప్రజా మేధావి. రైతు ఉద్యమ చరిత్రను నమోదు చేసిన రచయిత. సాహిత్యాన్ని కూడా ఆస్వాదించి, కొత్త రచయితలను ప్రోత్సహించిన సహృదయుడు. అయితే ఆయన జీవితానికి అసలు కొలమానం పదవులు కాదు. ప్రజల మధ్య గడిపిన కాలం. నిర్బంధంలో నిలబెట్టుకున్న నిబద్ధత. రైతు సమస్యపై చూపిన పట్టుదల. చదివిన పుస్తకాలను ఉద్యమ జ్ఞానంగా మార్చిన తీరు. ఒక తరం నుంచి మరో తరానికి అందించిన రాజకీయ అనుభవం. సాహిత్యాన్ని కూడా ప్రజా జీవితంలోని అంతర్భాగంగా చూడగలిగిన విస్తృత దృష్టి.

నేడు భారత వ్యవసాయం కొత్త సంక్షోభాల మధ్య ఉంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. పంట ధరల్లో అనిశ్చితి కొనసాగుతోంది. కౌలు రైతులకు గుర్తింపు కొరవడుతోంది. వాతావరణ మార్పులు పంటలపై ప్రభావం చూపుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులపై కార్పొరేట్ ఆధిపత్యం పెరుగుతోంది. వ్యవసాయ మార్కెట్‌లో రైతు బేరసారాల శక్తి బలహీనంగా ఉంది. ఇలాంటి సమయంలో మల్లారెడ్డి గారి జీవితాన్ని స్మరించుకోవడం అంటే ఒక సీనియర్ నాయకుడిని అభినందించడం మాత్రమే కాదు. ఆయన నేర్పిన పద్ధతిని తిరిగి గుర్తుచేసుకోవడం. ప్రజల మధ్య ఉండాలి. చదవాలి. ప్రశ్నించాలి. వాస్తవాలను సేకరించాలి. రైతాంగాన్ని ఒకే సమూహంగా కాకుండా దాని అంతర్గత వర్గ సంబంధాలతో చూడాలి. ప్రభుత్వ విధానాలను విమర్శించడమే కాదు, వాటి వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాలను బయటపెట్టాలి. ఉద్యమాన్ని నినాదం నుంచి సంఘటిత శక్తిగా మార్చాలి. చరిత్రను అధ్యయనం చేసి వర్తమాన పోరాటానికి ఉపయోగించాలి. సాహిత్యాన్ని ప్రజల జీవిత స్పందనగా చదవాలి. కొత్త రచయితలలోని సామాజిక చైతన్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. ఇదే సారంపల్లి మల్లారెడ్డి జీవిత సారం.

తిమ్మంపేటలో గ్రామీణ అసమానతలను చూసిన యువకుడు కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చాడు. నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. అజ్ఞాత జీవితాన్ని అనుభవించాడు. రైతాంగాన్ని సంఘటితం చేశాడు. రాష్ట్రం నుంచి దేశస్థాయికి రైతు గొంతును తీసుకెళ్లాడు. పుస్తకాలు రాశాడు. చరిత్రను అధ్యయనం చేశాడు. సాహిత్యాన్ని చదివాడు. ఒక కవితా సంపుటిని కొద్దిసేపట్లో చదివి దాని అంతరార్థాన్ని పట్టుకుని ముందుమాట రాసినంత వేగంతో రచనను అర్థం చేసుకున్నాడు. వయసు మీదపడినా ఉద్యమాన్ని విడిచిపెట్టలేదు. అందుచేత సారంపల్లి మల్లారెడ్డి జీవితం ఒక వ్యక్తి జీవిత చరిత్ర కాదు. అది తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమం, రైతాంగ పోరాటం, అధ్యయనం, సాహిత్య సంస్కారం, ప్రజా నిబద్ధత కలిసిన ఒక దీర్ఘ ప్రయాణం. పొలాన్ని చదివిన కమ్యూనిస్టు ఆయన. రైతు బాధను రాజకీయ ప్రశ్నగా మలిచిన నాయకుడు ఆయన. చరిత్రను చదివి, చరిత్రను రాసి, చరిత్రలో భాగమైన ఉద్యమకారుడు ఆయన. సాహిత్యంలోని సామాజిక స్పందనను గుర్తించిన సహృదయ పాఠకుడు ఆయన. ప్రజల కోసం పోరాడాలంటే ముందుగా ప్రజల జీవితాన్ని చదవాలి. ఆ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే అధ్యయనం చేయాలి. అధ్యయనాన్ని ఉద్యమంగా, ఉద్యమాన్ని సంఘటిత శక్తిగా మార్చాలి. ఇదే మల్లారెడ్డి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి దీర్ఘ ప్రజా – రైతాంగ ఉద్యమ జీవితానికి విప్లవ జోహార్లు.

  • మామిండ్ల రమేష్ రాజా
    రాష్ట్ర కార్యదర్శి,
    సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ,
    సెల్ : 78932 30218
RELATED ARTICLES
- Advertisment -

Most Popular