📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రేమ పేరుతో నమ్మించి.. గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరణ?

ప్రేమ పేరుతో నమ్మించి.. గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరణ?

📰 Generate e-Paper Clip

ప్రేమ పేరుతో నమ్మించి.. గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరణ?

బూర్గంపహాడ్, ఆగస్టు 26(ప్రజాక్షేత్రం):ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆమె గర్భవతి అయిన అనంతరం పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఓ యువతి చేసిన ఆరోపణలు బూర్గంపాడు మండలంలో తీవ్ర చర్చకు దారితీశాయి. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరుతూ యువతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటి ఎదుట నిరసనకు ప్రయత్నించినట్లు సమాచారం. మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన దారా జయరాం కుమార్తె దారా శివాని, బూర్గంపాడుకు చెందిన తోకల సాయిపై ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. తనను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి తనతో సంబంధం కొనసాగించాడని, ఈ క్రమంలో తాను గర్భవతి అయ్యానని ఆమె ఆరోపించినట్లు సమాచారం. తనకు గతంలోనే వివాహం జరిగిన విషయాన్ని సాయి చెప్పినప్పటికీ, ఆ వివాహం తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందని, తల్లిదండ్రుల ఒత్తిడితో వివాహం చేసుకున్నానని చెప్పి తనను నమ్మించాడని శివాని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మొదటి భార్యతో తనకు సఖ్యత లేదని, తనను వివాహం చేసుకుంటానని చెప్పడంతో తాను అతడిని నమ్మినట్లు ఆమె ఆరోపించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం తాను గర్భవతి అయిన తర్వాత పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని శివాని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, తనకు న్యాయం చేయాలని కోరుతూ సాయి ఇంటి వద్దకు వెళ్లినట్లు సమాచారం.

ఇంటి వద్ద ఉద్రిక్తత

శివాని తన కుటుంబ సభ్యులతో కలిసి సాయి ఇంటి ఎదుట నిరసనకు ప్రయత్నించిన సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. సాయి బంధువులు అక్కడికి చేరుకుని తమను అడ్డుకోవడంతో పాటు దాడికి పాల్పడ్డారని శివాని కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

న్యాయం చేయాలని యువతి వేడుకోలు

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇప్పుడు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని శివాని కోరుతున్నట్లు తెలుస్తోంది. తనపై జరిగిన అన్యాయంపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టి, నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అధికారికంగా ఫిర్యాదు అందినట్లయితే ఇరువర్గాల వాదనలు, ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించి పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, యువతి చేసిన ఆరోపణలపై తోకల సాయి వివరణ తెలియాల్సి ఉంది. ఆరోపణలు నిర్ధారణ కావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular