మరణానికీ దక్కని మానవ గౌరవం
- తింసాన్ పల్లిలో దళితుల దుర్భర జీవనం
- వరద వాగు దాటితేనే శ్మశానానికి చేరే పరిస్థితి
- మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ప్రాణాలకు తెగించిన కుటుంబ సభ్యులు
- ఏటా పునరావృతమవుతున్న విషాద గాథ
- పల్లెచెల్మ వాగుపై వంతెన కోసం గ్రామస్తుల వేడుకోలు
- సుమారు 200 ఎకరాల భూముల రైతుల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు
- మానవతా దృక్పథంతో స్పందించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి
పెద్దేముల్, ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):మనిషి పుట్టుక ఎంత సహజమో… మరణం కూడా అంతే సహజం.అయితే, మరణించిన వ్యక్తికి చివరి వీడ్కోలు పలికే హక్కు కూడా ప్రాణాలకు తెగించి సాధించాల్సిన పరిస్థితి ఉంటే…అది అభివృద్ధి చెందిన సమాజానికి మచ్చే.వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తింసాన్ పల్లి గ్రామంలో దళిత కుటుంబాలు ఎదుర్కొంటున్న దుస్థితి అలాంటిదే.స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడిచినా, నేటికీ ఒక వంతెన లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించడమే ప్రాణాంతకంగా మారింది.
చివరి ప్రయాణం… ప్రాణాలతో పోరాటం
పెద్దేముల్ మండల తింసాన్ పల్లి గ్రామానికి చెందిన జి.బాలమ్మ సోమవారం మృతి చెందారు.కుటుంబ సభ్యులు ఆమెకు సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి బయలుదేరారు.కానీ ప్రకృతి మరో పరీక్ష పెట్టింది.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెచెల్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.శ్మశానానికి వెళ్లే ఏకైక దారి అదే కావడంతో, కన్నీరుమున్నీరవుతూ మృతదేహాన్ని భుజాలపై మోసుకుని వరద నీటిలో అడుగులు వేయాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.ఒకవైపు వరద నీరు…మరోవైపు బురదమయం అయినా చివరి కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే తపనతో కుటుంబ సభ్యులు వాగును దాటారు.
ప్రతి వర్షాకాలం ఇదే దుస్థితి
ఇది ఒక్కరోజు సమస్య కాదని గ్రామ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఏడాది వర్షాకాలం రాగానే ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని చెబుతున్నారు.ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో పల్లెచెల్మ వాగు 8 నుంచి 10 అడుగుల లోతులో ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శ్మశానానికి వెళ్లడం అసాధ్యంగా మారుతోంది.అంత్యక్రియలు నిర్వహించాల్సిన సమయంలోనే కుటుంబ సభ్యులు ప్రాణభయంతో గడపాల్సి వస్తోందని వాపోతున్నారు.
అంత్యక్రియలు కాదు… కన్నీటి యాత్ర
ఇప్పటికే ఆత్మీయుడిని కోల్పోయిన కుటుంబం దుఃఖంలో ఉండగా, చివరి వీడ్కోలు చెప్పేందుకు కూడా వరదలో నడవాల్సి రావడం గ్రామస్థులను కలచివేస్తోంది.మృతదేహాన్ని భుజాన వేసుకుని వాగును దాటుతున్న దృశ్యాలు అక్కడి వారి జీవిత వాస్తవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల మృతుడికి గౌరవప్రదమైన అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడటం బాధాకరం.
రైతుల జీవనోపాధిపైనా తీవ్ర ప్రభావం
ఈ సమస్య దళిత కుటుంబాలకే పరిమితం కాలేదు. వాగు అవతల ఉన్న సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూములకు వెళ్లే రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తరలించడం, పంట కోత అనంతరం ధాన్యాన్ని తీసుకురావడం వంటి పనులు వర్షాకాలంలో పూర్తిగా అస్తవ్యస్తమవుతున్నాయి.దీంతో రైతులకు ఆర్థికంగా కూడా భారీ నష్టం వాటిల్లుతోంది.
ఏళ్లుగా వినతులు… ఫలితం మాత్రం శూన్యం
ఈ సమస్యపై పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు తింసాన్ పల్లి గ్రామస్తులు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించలేదని గ్రామస్థులు చెబుతున్నారు.ప్రతి ఏడాది ఇదే కష్టాలను ఎదుర్కొంటున్నా, సంబంధిత శాఖలు స్పందించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒక వంతెన… వందల కుటుంబాలకు భరోసా
పల్లెచెల్మ వాగుపై శాశ్వత వంతెన నిర్మిస్తే దళితుల అంత్యక్రియల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా, రైతుల రాకపోకలు కూడా సులభమవుతాయని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా అధికారులు మానవీయ దృక్పథంతో స్పందించి వెంటనే పల్లెచెల్మ వాగు పై నూతన వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.”బతికున్నప్పుడు బతుకు కోసం పోరాడాల్సి వస్తోంది… చనిపోయిన తర్వాత కూడా చివరి ప్రయాణానికి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది.ఇకనైనా తింసాన్ పల్లి ప్రజల కన్నీళ్లకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.”

