మృత్యు పాశంగా మారిన సీతారామ కెనాల్ వంతెన
- జింకలగూడెం సమీపంలో అడుగడుగునా గుంతలు.. బయటకొచ్చిన ఇనుప రాడ్లు
- రాత్రివేళ కనిపించని ప్రమాదపు గుంతలు.. వాహనదారుల ప్రాణాలతో చెలగాటం
- ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా?
- తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికుల డిమాండ్
బూర్గంపాడు, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):జింకలగూడెం సమీపంలోని సీతారామ కెనాల్ బ్రిడ్జి ప్రయాణికులకు మృత్యు పాశంగా మారుతోంది.వంతెనపై రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడటంతో పాటు రోడ్డు పెచ్చులూడి లోపల ఉన్న ఇనుప రాడ్లు బయటకు రావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో రహదారి దుస్థితి వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
అడుగు తీస్తే ప్రమాదమే..
వంతెనపై ఏర్పడిన గుంతలు చిన్నవిగా కనిపిస్తున్నప్పటికీ వాటి లోతు ఎక్కువగా ఉండటంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పే పరిస్థితి నెలకొంది.రహదారి పెచ్చులూడి బయటకు వచ్చిన ఇనుప రాడ్లు వాహనాల టైర్లకు తగిలి ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే రోడ్డు మొత్తం అధ్వానంగా మారడంతో వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాత్రివేళ మరింత ప్రమాదం
పగటి సమయంలోనే గుంతలను తప్పించుకుంటూ ప్రయాణించాల్సి వస్తుండగా రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. సరైన వెలుతురు లేకపోవడంతో గుంతలు కనిపించకపోతే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
సీతారామ కెనాల్ బ్రిడ్జిపై రహదారి దుస్థితి గురించి సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తక్షణ మరమ్మతులు చేపట్టాలి
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెనపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చడంతో పాటు బయటకు వచ్చిన ఇనుప రాడ్లను తొలగించి రహదారికి నాణ్యమైన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

