📄 ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeతెలంగాణడీజేలపై పెద్దేముల్ పోలీసుల కఠిన చర్యలు

డీజేలపై పెద్దేముల్ పోలీసుల కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

  • పోలీసుల హెచ్చరికలు బేఖాతర్…డీజేల ఏర్పాటు
  • ఇదివరకే 14 మంది డీజే ఆపరేటర్ల బైండోవర్
  • నిబంధనలు ఉల్లంఘించిన 8 మందిపై కేసులు
  • ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు
  • పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్

పెద్దేముల్, సెప్టెంబర్ 23(ప్రజాక్షేత్రం):పోలీసులు చేసిన ముందస్తు హెచ్చరికలను బేఖాతరు చేసి నిబంధనలకు విరుద్ధంగా వినాయక నిమజ్జన ఉత్సవాలలో డీజేలు ఏర్పాటు చేసిన 8 మంది ఆపరేటర్లపై పెద్దేముల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన వినాయక శోభాయాత్రల సందర్భంగా అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసిన ఎనిమిది మంది డీజే ఆపరేటర్లపై కేసులు నమోదు చేసినట్లు పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.

ముందుగానే హెచ్చరికలు

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన శాంతి సమావేశంలో మండల పెద్దలు,ఆయా గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులకు శోభాయాత్ర సమయంలో డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టంగా సూచించినట్లు ఎస్ఐ తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ముందుగానే హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

బైండోవర్ చేసినా..

నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు మండలంలోని 14 మంది డీజే ఆపరేటర్లను పెద్దేముల్ తహసీల్దార్ బి.వెంకటేష్ ప్రసాద్ సమక్షంలో బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అయినప్పటికీ కొందరు నిబంధనలను ఉల్లంఘించి శోభాయాత్రల్లో డీజేలు ఏర్పాటు చేసినట్లు గుర్తించడంతో వారిపై కఠిన చర్యలు చేపట్టి కేసులు నమోదు చేశామన్నారు.

ఎనిమిది మందిపై కేసులు

అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఎనిమిది మంది డీజే ఆపరేటర్లపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 221, 223, 292 కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఇబ్బందులు పడే విధంగా అధిక శబ్దం చేయడం,ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలను పోలీసులు తీవ్రంగా పరిగణించినట్లు పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు

పండుగలు, ఉత్సవాల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ స్పష్టం చేశారు.ప్రజా శాంతి, భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఇదే విధంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular