📄 ePaper
Sunday, July 26, 2026
📄 ePaper
Homeరాజకీయంచేవెళ్ల కాంగ్రెస్‌లో ‘పాత–కొత్త’ కుంపటి!

చేవెళ్ల కాంగ్రెస్‌లో ‘పాత–కొత్త’ కుంపటి!

📰 Generate e-Paper Clip

చేవెళ్ల కాంగ్రెస్‌లో ‘పాత–కొత్త’ కుంపటి!

  • యాదయ్య వర్సెస్‌ భీమ్‌ భరత్‌.. ఆధిపత్య పోరుతో రగులుతున్న కాంగ్రెస్‌
  • మండల అధ్యక్షుల నియామకాలతో భగ్గుమన్న విభేదాలు..
  • గాంధీభవన్‌ మెట్లెక్కిన అసంతృప్తి నేతలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయా? పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన పాత కాంగ్రెస్‌ నేతలు, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకూ ముదురుతోందా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్యే కాలే యాదయ్య, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ భీమ్‌ భరత్‌ వర్గాల మధ్య సమన్వయం కొరవడటంతో నియోజకవర్గ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు బహిర్గతమవుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.

ఒకే పార్టీలో.. రెండు వర్గాలు!

బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత చేవెళ్ల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన భీమ్‌ భరత్‌ ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే, ఇన్‌చార్జ్‌ ఇద్దరూ కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం రెండు వర్గాలుగా పార్టీ శ్రేణులు విడిపోయాయనే ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారే అన్నట్టుగా కార్యక్రమాలు నిర్వహించడం, పదవుల విషయంలో తమ వర్గం వారికి ప్రాధాన్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేయడం వంటి పరిణామాలు పార్టీ అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయని కాంగ్రెస్‌ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

మండల అధ్యక్షుల నియామకంతో మంటలు

ఇటీవల నియోజకవర్గంలోని మండలాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులను నియమించడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. మొత్తం ఐదు మండలాల్లో రెండు చోట్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తన వర్గానికి చెందిన వారికి పదవులు ఇప్పించారనే ఆరోపణలు భీమ్‌ భరత్‌ వర్గం నుంచి వినిపిస్తున్నాయి.
ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ జెండా మోస్తూ పార్టీ కోసం పనిచేసిన తమను పక్కన పెట్టి.. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం ఏమిటని పాత కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పదవుల పంపకంలో స్థానికంగా పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. గాంధీభవన్‌ మెట్లెక్కిన అసంతృప్తి మండల అధ్యక్షుల నియామకంపై అసంతృప్తి కేవలం నియోజకవర్గానికే పరిమితం కాలేదు. ఏకంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ వరకు చేరింది. పార్టీకి చెందిన అసంతృప్తి నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌ వద్ద ఆందోళనకు దిగడం, ఎమ్మెల్యే కాలే యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేటకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా గాంధీభవన్‌ వద్ద నిరసన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఎమ్మెల్యే జోక్యం చేసుకోకూడదంటూ కొందరు నేతలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

నవాబ్‌పేటలో మరింత ముదిరిన వివాదం

నవాబ్‌పేట మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడి మార్పు వ్యవహారం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఎమ్మెల్యే కాలే యాదయ్య తన వర్గానికి చెందిన రావుగారి వెంకట్‌రెడ్డి పేరును సిఫారసు చేశారని, అప్పటికే ఆ పదవిలో ఉన్న సామ వెంకట్‌రెడ్డిని తప్పించి కొత్త అధ్యక్షుడిని నియమించడంపై ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకించిందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పాత నాయకత్వాన్ని కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సామ వెంకట్‌రెడ్డి వర్గీయులు గాంధీభవన్‌ వద్ద ఆందోళన చేపట్టడం ద్వారా తమ నిరసనను బహిరంగంగా వ్యక్తం చేశారు.

‘బీఆర్‌ఎస్‌ నేతలకే పదవులా?’

కాలే యాదయ్య కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి నియోజకవర్గంలో పాత కాంగ్రెస్‌ నేతలు, బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన నేతల మధ్య దూరం పెరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన తమను విస్మరించి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు, ప్రాధాన్యం ఇవ్వడం వల్లే కేడర్‌లో అసంతృప్తి పెరుగుతోందని పాత కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.
‘పార్టీ కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తల సంగతేంటి?’ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని జిల్లా స్థాయి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
యాదయ్యకు నిరసనలు కొత్తేమీ కాదంటున్న వర్గం
అయితే ఎమ్మెల్యే కాలే యాదయ్య వర్గం మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తోంది. యాదయ్యకు వ్యతిరేకంగా గతంలోనూ నిరసనలు జరిగిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయనపై గుడ్లు, టమాటాలు విసిరి ‘గో బ్యాక్‌’ అంటూ కొందరు నినాదాలు చేసిన ఘటనలను ప్రస్తావిస్తున్నారు. ఇటీవల షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం కూడా చర్చకు వస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించినట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఘటనలను పార్టీ అంతర్గత రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని వారు అంటున్నట్లు సమాచారం.

రేపటి పరిషత్‌ ఎన్నికలే అసలు పరీక్ష!

చేవెళ్ల కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఈ అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే రాబోయే పరిషత్‌ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మండల, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే వర్గాలుగా విడిపోతే ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, సమన్వయం వంటి అంశాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని నాయకులు భావిస్తున్నారు. అధికార పార్టీగా కాంగ్రెస్‌ బలంగా ఉండాల్సిన సమయంలోనే అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం కావడం పార్టీకి నష్టం చేస్తుందని కొందరు సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఇన్‌చార్జ్‌ భీమ్‌ భరత్‌ వర్గాల మధ్య సమన్వయం కుదిర్చి.. పాత, కొత్త నేతల మధ్య నెలకొన్న విభేదాలకు పార్టీ అధిష్ఠానం వెంటనే తెరదించాలని కేడర్‌ కోరుతోంది.
ఇప్పటికే గాంధీభవన్‌ వరకు చేరిన చేవెళ్ల కాంగ్రెస్‌ అంతర్గత వివాదం.. రానున్న రోజుల్లో ఇంకెంత దూరం వెళ్తుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

ఏం రవీందర్
సీనియర్ జర్నలిస్ట్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular