ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత.
- గుండెపోటుతో ముంబయిలో తుదిశ్వాస..
- విలన్ పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు.
ముంబయి ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):తెలుగు సినీ ప్రేక్షకులకు విలక్షణ ప్రతినాయకుడిగా సుపరిచితుడైన ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ప్రదీప్ సింగ్ రావత్ తన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగులో ‘సై’, ‘ఛత్రపతి’, ‘గజిని’ చిత్రాల్లో పోషించిన ప్రతినాయకుడి పాత్రలు ఆయనకు విశేష ఆదరణను తీసుకొచ్చాయి. ప్రదీప్ సింగ్ రావత్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమ ఓ ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయిందని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

