📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రభుత్వాసుపత్రిలో సైకో వీరంగం

ప్రభుత్వాసుపత్రిలో సైకో వీరంగం

📰 Generate e-Paper Clip

ప్రభుత్వాసుపత్రిలో సైకో వీరంగం

– ఘట్‌కేసర్‌లో సైకో హల్‌చల్.. నర్సుపై దాడి

ఘట్‌కేసర్, మే 19 (ప్రజాక్షేత్రం):మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు సైకోలా ప్రవర్తిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో బీభత్సం సృష్టించాడు. ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు విధుల్లో ఉన్న మహిళా నర్సుపై దాడి చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులపై కూడా దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సుమారు 24 ఏళ్ల యువకుడు ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడతానంటూ హడావుడి చేశాడు. తలకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తనను బతికించాలని, లేదంటే చంపేస్తానంటూ అక్కడి సిబ్బందిని బెదిరించాడు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న నర్సు జుట్టు పట్టుకుని పై అంతస్తు నుంచి కిందికి లాక్కొచ్చాడు.
యువకుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపై కూడా అతడు ఎదురు దాడికి దిగాడు. ఆసుపత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తూ భయాందోళనకు గురిచేశాడు. అనంతరం రోడ్డుపైకి పరుగెత్తగా, వెంటపడిన స్థానికులు అంబేద్కర్ విగ్రహం వద్ద అతడిని పట్టుకుని కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాడిలో గాయపడిన నర్సు, మరో ఇద్దరికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్థానికుల దాడిలో గాయపడిన యువకుడిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular