📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణనేను గుంపు మేస్త్రీనే.. నా గుంపంతా బాగా పనిచేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి

నేను గుంపు మేస్త్రీనే.. నా గుంపంతా బాగా పనిచేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నేను గుంపు మేస్త్రీనే.. నా గుంపంతా బాగా పనిచేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి

  • ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం
  • ఉద్యోగులపై ఒక్క రూపాయి భారం లేకుండా ‘ప్రమాద బీమా’
  • ఫాంహౌస్‌లో ఉండేటోళ్లకు మూసీ, మెట్రోతో పనేముంది?
  • గత ప్రభుత్వంపై సీఎం ఫైర్
  • దేశంలోనే తొలిసారి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ జూన్ 25(ప్రజాక్షేత్రం):”అవును.. నేను గుంపు మేస్త్రీనే.. అలా అన్నందుకు చాలా మంది నన్ను అవహేళన చేశారు. అందరూ హేళన చేసినా నేను అస్సలు బాధపడను.. ఈ గుంపంతా నాదే, నా గుంపులో ఉన్నవారంతా బాగా పనిచేస్తారు” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమా పథకం కోసం 14 బ్యాంకులతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల (ఎంఓయు) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటే అది ఉద్యోగుల శ్రమ వల్లేనని, భవిష్యత్తులో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అది కూడా వారి కృషితోనే సాధ్యమవుతుందని సీఎం కొనియాడారు.

దొరల గడీలు మాకొద్దు.. రేవంతన్న అని పిలిస్తే చాలు!

కొందరు తాము దొరలమని, గడీలు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటారని.. కానీ తనకు మాత్రం ప్రజలు, ఉద్యోగులు ‘రేవంతన్న’ అని పిలిపించుకోవడమే ఇష్టమని సీఎం భావోద్వేగంగా అన్నారు. ఇష్టం, ప్రేమ ఉంటేనే ముఖ్యమంత్రిని కూడా ‘అన్నా’ అని పిలుస్తారని పేర్కొన్నారు. తాము మూసీ నదిని ప్రక్షాళన చేస్తుంటే కొందరు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని, మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. “ఫాంహౌస్‌లో ఉండేటోళ్లకు మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణతో పనిలేదేమో కానీ.. పేద ప్రజలకు అవి చాలా అవసరం” అని విపక్షాలపై ధ్వజమెత్తారు.

ఆంక్షలున్నా.. ఒకటో తేదీనే జీతాలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లపాటు నెలలో పదో తేదీ వచ్చినా జీతాలు రాలేదని, వాయిదాల పద్ధతిలో ఇచ్చేవారని సీఎం గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తోందని చెప్పారు. పీఆర్సీ (పిఆర్సి) విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని హామీ ఇస్తూ.. అందరం రాష్ట్రం కోసం రోజుకు మరో గంట అదనంగా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

దేశంలోనే తొలిసారి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి బీమా లేదన్నారు. గత సర్కార్ చేసిన అప్పులను కడుతూనే తాము ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని, త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ‘ఇందిరమ్మ జీవితబీమా పథకం’ తీసుకురాబోతున్నామని ఈ సందర్భంగా భట్టి ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular