మాతృత్వానికే మచ్చ.. ప్రియుడితో కలిసి పిల్లలపై చిత్రహింసలు
- ఒంటినిండా కాలిన గాయాలతో ఇద్దరు చిన్నారులు.. తల్లి, ప్రియుడు అరెస్ట్
హైదరాబాద్, జూన్ 24(ప్రజాక్షేత్రం):మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ఓ తల్లి తన ప్రియుడితో కలిసి కన్నబిడ్డలపై అమానుషంగా చిత్రహింసలకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను రోజూ వేధిస్తూ, వారి శరీరాలపై వాతలు పెట్టి తీవ్ర గాయాలకు గురిచేయడం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన పింకీదేవి, సుజీత్ దంపతులు మూడేళ్ల క్రితం ఉపాధి కోసం వచ్చి స్థానిక పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో పింకీదేవికి చిందుకుమార్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. భార్య ప్రవర్తనపై తరచూ గొడవలు జరుగుతుండటంతో భర్త సుజీత్ మూడు నెలల క్రితం ఇంటిని విడిచి వెళ్లిపోయాడు. అనంతరం పింకీదేవి తన ప్రియుడు చిందుకుమార్ను ఇంటికే తీసుకొచ్చి సహజీవనం ప్రారంభించింది. తమ సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారనే కారణంతో ఆరేళ్ల కుమార్తె ప్రియాంక, నాలుగేళ్ల కుమారుడు ఆదిత్యపై ఇద్దరూ కలిసి దారుణంగా హింసకు పాల్పడ్డారు. చిన్నారుల శరీరాలపై వాతలు పెట్టడం, కాలిన గాయాలు చేయడం, తీవ్రంగా కొట్టడం వంటి క్రూర చర్యలను నిత్యకృత్యంగా మార్చుకున్నట్లు తెలిసింది. ఇంటి నుంచి తరచూ చిన్నారుల ఏడుపులు, అరుపులు వినిపించడంతో అనుమానం వచ్చిన కాలనీవాసులు బుధవారం ఇంటికి వెళ్లి పరిశీలించారు. అక్కడ చిన్నారుల ఒంటిపై తీవ్ర గాయాలు, కాలిన మచ్చలు కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు తల్లి, ఆమె ప్రియుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి పింకీదేవి, ఆమె ప్రియుడు చిందుకుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిన్నారులపై జరిగిన అమానుష హింసకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

