భూపాలపల్లిలో ఘోరం.. వాహన తనిఖీల్లో బొగ్గు టిప్పర్ బీభత్సం
- డీటీఓ వెంకన్న అక్కడికక్కడే దుర్మరణం!
- ఆఫీస్ ముందే అనంత లోకాలకు
- ఆర్టీఓ కార్యాలయం ముందే నిలబడి డ్యూటీ చేస్తుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ.
- చిద్రమైన మృతదేహం టైర్ల కింద పడి నుజ్జునుజ్జయిన అధికారి శరీరం..
- కళ్లారా చూసి తట్టుకోలేకపోయిన సిబ్బంది.
- 15 రోజుల ముందే బదిలీ జగిత్యాల నుంచి భూపాలపల్లికి వచ్చిన రెండు వారాల్లోనే విషాదం. డ్రైవర్ అరెస్ట్.
భూపాలపల్లి, జూన్ 22(ప్రజాక్షేత్రం):జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుండెల్ని పిండేసే అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై నిలబడి వాహనాలను తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా అధికారి (డిటిఓ) బి. వెంకన్న (45)ను ఒక భారీ బొగ్గు టిప్పర్ లారీ బలితీసుకుంది. పరకాల – భూపాలపల్లి ప్రధాన రహదారిపై గణపురం మండలం చెల్పురు శివారులో ఉన్న జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ దారుణం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం రవాణా శాఖ సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు తీసుకునేందుకు ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో విధుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పరకాల వైపు నుంచి భూపాలపల్లి వైపు వస్తున్న ఒక బొగ్గు టిప్పర్ లారీ ఒక్కసారిగా అదుపు తప్పి వేగంగా అధికారుల వైపు దూసుకొచ్చింది.
కళ్లముందే నుజ్జునుజ్జయ్యిన శరీరం..
రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక హార్వెస్టర్ వాహనాన్ని, డీటీఓ కారును ఢీకొడుతూ.. అక్కడ నిలబడి ఉన్న వెంకన్నపైకి ఆ లారీ దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు లారీ టైర్లు ఆయనపై నుంచి వెళ్లడంతో వెంకన్న శరీరం మొత్తం నుజ్జునుజ్జయ్యి, తీవ్ర రక్తస్రావంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కళ్లముందే తమ పైఅధికారి ప్రాణాలు కోల్పోవడంతో తోటి సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనకు, దిగ్భ్రాంతికి గురయ్యారు.
15 రోజుల క్రితమే బదిలీపై రాక..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన వెంకన్న, కేవలం 15 రోజుల కిందటే (రెండు వారాల క్రితం) జగిత్యాల నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు డీటీఓగా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టి రెండు వారాలు కూడా గడవకముందే ఆయన ఇలా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడం రవాణా శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.
విచారణకు ఆదేశించిన రవాణా శాఖ మంత్రి
ఈ ప్రమాద వార్త తెలియగానే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉంటూ రవాణా శాఖ అధికారి వెంకన్న మరణించడం అత్యంత విచారకరమని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వెంకన్న కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

