‘జై భీమ్’ సినిమాను తలపిస్తున్న విషాదం..
- పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన కొడుకు ఏమయ్యాడు?
- కన్నీరుమున్నీరవుతున్న కన్నతల్లి!
- కన్నతల్లి గుండె కోత.. ‘నా కొడుకును చంపేసి తగలబెట్టారు’
- హైకోర్టులో ‘హేబియస్ కార్పస్’.. కదిలిన యంత్రాంగం
- చనిపోతే పిరికడి మట్టి అయిన ఇయ్యండని తల్లి రోదన
విజయవాడ, జూన్ 21(ప్రజాక్షేత్రం):సినిమాల్లో చూసే దారుణాలు నిజజీవితంలో ఎదురైతే ఆ కుటుంబాల గుండెకోత వర్ణనాతీతం. నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా గుర్తుంది కదా? దొంగతనం నేరం మోపి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భర్త లాకప్‌లోనే చనిపోతే.. ఆ శవాన్ని మాయం చేసి, అతడు పారిపోయాడని పోలీసులు అబద్ధాలు చెప్తారు. భర్త ఆచూకీ కోసం ఆ భార్య చేసిన పోరాటం అందరి కళ్లలో నీళ్లు తెప్పించింది. సరిగ్గా అలాంటి ఘోరమైన ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే జరిగింది.మే 9వ తేదీన విజయవాడ కృష్ణలంక పోలీసులు గాదె సాయికృష్ణ (26) అనే యువకుడిని విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకెళ్లారు. కానీ, రోజులు గడుస్తున్నా అతడు ఇంటికి రాలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన ఆ కన్నతల్లికి.. “నీ కొడుకు ఇక్కడి నుంచి ఎప్పుడో వెళ్లిపోయాడు” అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
కన్నతల్లి గుండె కోత.. ‘నా కొడుకును చంపేసి తగలబెట్టారు!’
“నా కొడుకు తప్పు చేసుంటే కోర్టులో నిలబెట్టాలి కానీ, కొట్టి చంపేస్తారా?” అంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి మీడియా ముందు పెట్టిన ఏడుపు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తోంది. కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) నాగరాజు తన కొడుకును లాకప్‌లో విపరీతంగా హింసించి చంపేశాడని.. ఆ తర్వాత సాక్ష్యాలు లేకుండా శవాన్ని రహస్యంగా తగలబెట్టేశారని ఆమె రోదిస్తూ ఆరోపించింది. ‘నీ కొడుకు ఇక ఎప్పటికీ తిరిగిరాడు’ అని సదరు పోలీస్ అధికారి తనను బెదిరించాడని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
హైకోర్టులో ‘హేబియస్ కార్పస్’.. కదిలిన యంత్రాంగం
పోలీసులు నమ్మించకపోవడంతో, ‘జై భీమ్’ సినిమా తరహాలోనే బాధితురాలు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. తన కొడుకును కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటూ ‘హేబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేసింది. ఈ దారుణంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 29 లోగా సాయికృష్ణను సజీవంగానో లేదా మృతుడిగానో కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను కరాఖండిగా ఆదేశించింది.

