
మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా.. కలెక్టర్‌కు వినతిపత్రం
మేడ్చల్-మల్కాజిగిరి, జూలై 13(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన సంక్షేమ హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్.కె. సలీం, గుమ్మడి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి బనావత్ రవినాయక్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు, పిల్లల విద్యా ఫీజుల్లో రాయితీలు, ఇంటి స్థలాల వంటి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు.మీడియా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా, నియోజకవర్గ ఇన్‌చార్జులు, నాయకులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

