నిరుద్యోగుల గొంతుక
పాలమూరు మట్టి బిడ్డ
ఆస్మా
తెలంగాణలో పాలమూరు అంటే కేవలం ఒక జిల్లా పేరు కాదు. అది వలస బతుకుల చిరునామా. రోజువారీ కూలి కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లే కుటుంబాల ఆర్తనాదం. పాలమూరు మట్టిలో బతుకు పుట్టడం అంటే, పోరాటాన్ని జన్మతః అందిపుచ్చుకోవడం. అలాంటి ఆ మట్టిలో అస్మా పుట్టింది.
చదువు వాసన తెలియని ఇంట్లో కళ్లు తెరిచింది. ఆకలి కేకలు లాలిపాటలుగా పెరిగింది. అతి చిన్న వయసులోనే అమ్మ నీడ దూరమైంది. నాన్న అండ కోల్పోయింది. ఇద్దరి చేతుల ఆసరా పోయినప్పుడు సామాన్యంగా మనిషి కుంగిపోతాడు. కానీ అస్మా కుంగలేదు. ఆ కన్నీళ్లే ఆమెకు కసి అయ్యాయి. ఆ ఆకలి కేకలే ఆమెలో పోరాట చైతన్యాన్ని రగిలించాయి.
కుట్టు మిషన్ తిప్పిన చేయి — పుస్తకం పట్టింది
బతుకుదెరువు కోసం చేతులు కుట్టు మిషన్ తిప్పాయి. అదే చేతులు రేపటి కోసం పుస్తకం పట్టుకున్నాయి. ఇది కేవలం కవితా భాష కాదు, అస్మా జీవితంలో జరిగిన వాస్తవం. ఒక వైపు కుటుంబ పోషణ , మరొక వైపు విద్యాసాధన, రెండింటినీ ఒకేసారి నిర్వహించడం సాధారణమైన పని కాదు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరున ఉన్న లైబ్రరీ ఆమెకు ఇల్లైంది. ఆ గ్రంథాలయం కేవలం పుస్తకాల గది కాదు, అది ఒక సిద్ధాంత పాఠశాల. అక్కడ ఆమె పరీక్షలకు మాత్రమే చదవలేదు. అంబేద్కర్ రాసిన మాటలు చదివింది. పూలే దంపతుల పోరాట చరిత్ర అందిపుచ్చుకుంది. హక్కు అంటే ఏమిటో, సమానత్వం అంటే ఏమిటో, ఆ నాలుగు గోడల మధ్య నేర్చుకుంది. ఉదయం తొమ్మిది నుండి రాత్రి పదకొండు వరకు ఆ లైబ్రరీయే ఆమె ప్రపంచం. సెలవులు లేవు. అలసట సాకు కాదు. పేదరికం అడ్డంకి కాదు. అక్షరం అక్షరం శ్రమతో చదివి, TET పాసైంది. NET సాధించింది. SET అర్హత పొందింది. ఒక్కసారి కాదు, అన్నీ. రెండు సార్లు జూనియర్ లెక్చరర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళింది. ఉద్యోగం ఆమె సొంతం అనుకుంది. కానీ కాలం ఆమెకు మరో పోరాటాన్ని ఇచ్చింది. ఈ విజయాలు కేవలం ఒక అమ్మాయి సాధించిన అర్హతలు కాదు, అవి వ్యవస్థ ముఖాన విసిరిన ధిక్కారం.
సావిత్రిబాయి పూలే నడిచిన దారిలో
పంతొమ్మిదవ శతాబ్దంలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు ఒక మహత్తర సత్యాన్ని ప్రపంచానికి చాటారు. విద్యే సమాజ పరివర్తనకు తొలి ఆయుధం. అణగారిన వర్గాల స్త్రీలకు చదువు నేర్పడం అప్పటి సమాజం నిషేధించింది. రాళ్లు రువ్వారు. వ్యతిరేకించారు. అయినా సావిత్రిబాయి పాఠశాల తలుపులు తెరిచారు. “విద్య లేకుండా హక్కులు రావు. హక్కులు లేకుంటే మనుషులకు గౌరవం ఉండదు” ఈ నమ్మకమే ఆమె ఆయుధం. అస్మా జీవితం ఆ నమ్మకానికి సజీవ నిదర్శనం. కుట్టు మిషన్ తిప్పుతూ పుస్తకం పట్టుకున్న ఆ చేయి, పూలే దంపతుల కలకు కొనసాగింపు. పేదరికం, అనాథత్వం, సామాజిక వివక్ష, ఏదీ ఆమె చదువుకు అడ్డు నిలవలేదు.
అంబేద్కర్ లైబ్రరీలో ఆమె అందిపుచ్చుకున్న భావజాలం ఒక్కటే, తన హక్కు తనకు దక్కకపోతే వ్యవస్థ ముందు వంగిపోవడం కాదు, గళం విప్పడం. అందుకే ఆమె పోరాటం వీధులలో మొదలైంది.
ముసుగు ఆమె ధైర్యాన్ని అడ్డుకోలేదు — మహిళా సాధికారత అంటే ఇదే
మన సమాజంలో ఒక స్టీరియోటైప్ బలంగా ఉంది . బురఖా ధరించే మహిళ ఇంటికే పరిమితమవుతుందని, ఆమె గొంతు బయటికి రాదని. ఈ అపోహను అస్మా ధైర్యంగా, పదే పదే, బహిరంగంగా బద్దలు కొట్టింది. ఆ ముసుగు స్వేచ్ఛకు సంకెళ్లు కాదు, ఆమె ఆత్మవిశ్వాసానికి గుర్తు. ఆ వస్త్రంతోనే ఆమె వేలాది నిరుద్యోగుల ముందు నిలబడింది. ఆ ముఖంతోనే అధికార వ్యవస్థను ప్రశ్నించింది. ధర్నాల్లో నిలబడింది. ర్యాలీలలో నడిచింది. మీడియా ముందు మాట్లాడింది. ఎన్నికల్లో పోటీ చేసింది. మహిళా సాధికారత అంటే కేవలం అక్షరాస్యత కాదు, ఉద్యోగం మాత్రమే కాదు, తన హక్కు కోసం నిలబడగలగడం, తన సమాజం కోసం గళమెత్తగలగడం. అస్మా అదే చేసింది. చరిత్ర సాక్షిగా చూస్తే, ఐలమ్మ భూమి కోసం పోరాడింది. రుద్రమదేవి రాజ్యం కోసం పోరాడింది. ఢిల్లీని నేలిన రజియా సుల్తానా అధికారం కోసం పోరాడింది. ఇప్పుడు అస్మా లక్షలాది నిరుద్యోగుల ఆకలి కోసం పోరాడుతోంది. ఆ వరుసలోనే ఈ తెలంగాణ మహిళ చరిత్రలో నిలబడుతోంది.
వ్యవస్థ చేసిన తప్పిదం — ఒక అగ్నిపర్వతం పుట్టింది
అర్హత సాధించిన తర్వాత ఉద్యోగం రావడం న్యాయమని అందరూ అనుకుంటారు. అస్మా కూడా అదే అనుకుంది. TET, NET, SET అన్నీ పాసైంది. అన్నీ అర్హతలూ ఉన్నాయి. కానీ ఉద్యోగం రాలేదు. వ్యవస్థ చేసిన తప్పిదం ఆమె కలలను ముక్కలు చేసింది. కానీ ఆ ఆవేదన నుండే ఒక అగ్నిపర్వతం ఉద్భవించింది. కన్నీళ్లు ఆగిపోయాయి. గొంతు గర్జించింది. ఒక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగం కోసం కాదు, తనలాంటి లక్షలాది మంది నిరుద్యోగుల ఆశల కోసం పోరాటం చేయాలని. తెలంగాణలో వేలాది మంది అభ్యర్థులు TET, NET, SET, పోలీస్ ఉద్యోగానికి అర్హతలు సాధించి ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ వస్తుందని ఆశతో ఉన్నారు. కానీ నిరీక్షణ సంవత్సరాలుగా సాగుతోంది.
ఉద్యమం — ఇందిరా పార్క్ నుండి జూబ్లీహిల్స్ వరకు
అస్మా పోరాటం కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఇందిరా పార్క్ వేదికగా ధర్నాలు చేసింది. నిరుద్యోగ ర్యాలీలు నిర్వహించింది. రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అధికారులను నేరుగా నిలదీసింది.
రాజకీయ పార్టీలు నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలు పట్టించుకోవడం లేదన్న వాస్తవాన్ని ఆమె బహిరంగంగా చెప్పింది. నిరుద్యోగుల గొంతుకగా తానే చట్టసభలో పోరాడాలని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిలబడింది. ఆ నిర్ణయం చాలా ధైర్యసాహసాలు అవసరమయ్యే పని. వనరులు లేవు. పార్టీ నిధులు లేవు. అయినా అస్మా ఆ ఎన్నికలో నిలబడింది, నిరుద్యోగ సమస్యలను నేరుగా చట్టసభ వరకు తీసుకెళ్లేందుకు. ఫలితంగా రాజకీయ పార్టీలన్నీ నిరుద్యోగ అంశాలను తమ ఎన్నికల ప్రచారంలో చర్చకు తీసుకురాక తప్పలేదు. ఇది చిన్న విజయం కాదు.
పరమత సహనం — అందరి కోసం అందరితో
అస్మా పోరాటంలో మరో గొప్ప సందేశం ఉంది, పరమత సహనం. ఆమె ఒక మతానికి చెందినప్పటికీ ఆమె గొంతు అన్ని కులాల, అన్ని మతాల నిరుద్యోగుల గొంతు. TET పాసైన హిందూ అభ్యర్థి అయినా, SET పాసైన క్రైస్తవ విద్యార్థి అయినా, అందరి కష్టం ఒక్కటే, అందరి ఆశ ఒక్కటే.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధించింది. ఆర్టికల్ 16 ఉద్యోగ అవకాశాల్లో సమానత్వాన్ని హామీ ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అస్మా తన పోరాటంలో జీవింపజేస్తోంది.
ఆమె చూపు ఒక వర్గానికి పరిమితం కాదు, సరిహద్దుల వరకు, అడవుల వరకు, కొండల వరకు విస్తరించిన ఒక సమ్మిళిత న్యాయ దృష్టి. నిరుద్యోగ యువత మాత్రమే కాదు, మహిళా సాధికారత, తెలంగాణ అస్తిత్వం, రైతు సమస్యలు, జర్నలిస్టుల హక్కులు, ప్రతి అంశంలో ఆమె గొంతు వినిపిస్తోంది.
నిరుద్యోగ యువత ప్రధాన డిమాండ్లు
అస్మా నేతృత్వంలో తెలంగాణ నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి పోరాడుతున్న ప్రధాన డిమాండ్లు, మేగా DSC జంబో నోటిఫికేషన్, అన్యాయమైన జి.వో.లు రద్దు, గ్రూప్స్ మరియు పవర్ సెక్టార్ నోటిఫికేషన్లు వెంటనే విడుదల, OTR నమోదుపై చివరి తేదీ విధించకపోవడం, మరియు వయోపరిమితి సడలింపు, ఇవి కేవలం ఒక వ్యక్తి కోసం కాదు, లక్షలాది అర్హుల న్యాయం కోసం. సామాజిక న్యాయం అనేది కేవలం ఎన్నికల నినాదం కాదు. అది ప్రతి రోజు వ్యవస్థ నిలబెట్టాల్సిన బాధ్యత. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జాబ్ క్యాలెండర్ సకాలంలో విడుదల, అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ నిష్పక్షపాత పరిగణన, ఇవే సామాజిక న్యాయపు మెట్లు. అస్మా పోరాటం ఈ మెట్లు ఎక్కించే ప్రయత్నం.
తెలంగాణ అభివృద్ధి — నిజమైన సార్థకత
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగింది. అమర వీరులు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలు సార్థకం కావాలంటే, అర్హత ఉన్న ప్రతి యువకుడికి ఉద్యోగం రావాలి. ప్రతి పరీక్ష పారదర్శకంగా జరగాలి. ప్రతి నోటిఫికేషన్ సకాలంలో రావాలి. అస్మా పోరాటం ఆ లక్ష్యం వైపే సాగుతోంది. కోట్లాది మంది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, నీళ్లు, నిధులు, నియామకాలతో కూడిన సామాజిక తెలంగాణగా రూపొందాలని ఆమె అలుపెరగక పోరాడుతోంది.
ముగింపు
అస్మా కథ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, ఇది ఒక్కరి కథ కాదు. ఆమె ఒంటరి కాదు. ఆమె పక్కన పూలే దంపతుల స్ఫూర్తి ఉంది. ఆమె చేతిలో అంబేద్కర్ రాజ్యాంగం ఆయుధంగా ఉంది. ఆమె గొంతులో లక్షలాది నిరుద్యోగుల వేదన ఉంది. పేదరికంలో పుట్టి, అనాథత్వాన్ని జయించి, పరీక్షలన్నీ పాసై, అయినా సరే వ్యవస్థతో పోరాటం చేస్తున్న ఈ మహిళ, ప్రతి సామాన్యుని పోరాట విజయానికి నిదర్శనం. పాలమూరు మట్టిలో పుట్టిన ఈ నల్ల గులాబీ నేడు తెలంగాణ నిరుద్యోగుల రేపటి ఆశల దీపమైంది.


