వీడిన కృష్ణలంక కేసు మిస్టరీ.. జై భీమ్’ సీన్ రిపీట్!!
- సాయికృష్ణది లాకప్ డెత్తే..
- కోర్టుకు సమర్పించిన నివేదికలో నిర్ధారించిన ‘సిట్’!
- తీవ్ర థర్డ్ డిగ్రీ హింసకు తాళలేక యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్
- మృతదేహాన్ని స్వర్గపురి శ్మశానవాటికలో రహస్యంగా దహనం చేసిన పోలీసులు
- కేసును తప్పుదోవ పట్టించడానికి పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసిన వైనం
- సీఐ నాగరాజును దర్యాప్తుకు సహకరించడం లేదన్న సిట్
- 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు
విజయవాడ నగరంలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు చివరకు దారుణమైన లాకప్ డెత్‌గా నిర్ధారణ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సస్పెండెడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) ఎస్‌ఎస్‌ఎస్‌వీ నాగరాజును సిట్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేయగా.. బుధవారం ఉదయం విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో, పోలీసులు అతనిని నెల్లూరు జైలుకు తరలించారు. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ‘జై భీమ్’ సినిమా తరహాలోనే గుండె తరుక్కుపోయే నిజాలను వెల్లడించింది. సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు నిర్బంధించి, స్టేషన్‌లో అత్యంత అమానవీయంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టారు. పోలీసుల దెబ్బలకు తాళలేక సాయికృష్ణ స్టేషన్ లోపలే కన్నుమూశాడు. ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు అప్పటి సీఐ నాగరాజు హాలీవుడ్ విలన్ తరహాలో ప్లాన్ వేశాడు. స్టేషన్‌లో తాము చేసిన నిర్వాకం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు పీఎస్‌లోని సిసిటివి ఫుటేజ్ మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేయించాడు. అనంతరం మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా సిటీలోని ‘స్వర్గపురి’ శ్మశానవాటికకు తరలించి, రికార్డులను సైతం తారుమారు చేసి అనాథ శవంగా రహస్యంగా దహనం చేయించేశారు. తన కొడుకు కనిపించడం లేదంటూ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ నరరూప రాక్షసుల గుట్టు రట్టయింది. ప్రభుత్వం రంగంలోకి దించిన ‘సిట్’ బృందం కేవలం 3 గంటల సుదీర్ఘ విచారణలోనే సాంకేతిక ఆధారాల సహాయంతో సాక్ష్యాలను సేకరించి సీఐని బుక్ చేసింది. ఈ ఘటన ఖాకీ యూనిఫాంలో దాగున్న క్రూరత్వాన్ని బయటపెట్టడమే కాకుండా, బాధితుడి కుటుంబానికి జరిగిన తీరని అన్యాయం స్థానికుల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది.

